మిగితా రాష్ట్రాల సంగతి ఎలాగున్నా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం మోడిని సమర్ధిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాబట్టే ఏపి, తెలంగాణాల్లో గడువుకున్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరంలోనే జరుగుతాయా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2018 చివరికే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. పార్లమెంట, అసెంబ్లీ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు ఎన్నికల కమీషన్ కూడా చెబుతోంది. అదే విషయంపై కేంద్ర ఎన్నికల కమీషన్ అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ విషయంలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మోడికి మద్దతు తెలుపుతున్నట్లే కనబడుతోంది.

పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఢిల్లీ సర్కిళ్ళల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఒకవేళ భాజపా ఓడిపోయినా, గెలిచినా పార్లమెంట్ కు ముందస్తు ఎన్నికలు తప్పదట. ఎందుకంటే, ఐదు రాష్ట్రాల్లో భాజపా గెలిస్తే తన నిర్ణయాలన్నింటికీ ప్రజామోదం ఉంది కాబట్టి మోడి మరింత రెచ్చిపోతారన్నది ఓ వాదన. అందుకనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి తాజాగా ప్రజాతీర్పు కోరుతారని ప్రచారం మొదలైంది. ఇక ఓడిపోయినా పార్లమెంట్ కు ప్రజా తీర్పు కోరుతారని అంటున్నారు. ఎందుకంటే, ఉన్నకొద్దీ ప్రభుత్వంపై ప్రజలకు వ్యతరేకత పెరిగేదే కానీ తగ్గదు. ఈ పరిస్ధితుల్లో ప్రజల్లో మరింత వ్యతిరేకతను మూటగట్టుకునే కన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే బాగుంటుందని మోడి భావిస్తున్నారట.

సరే, మోడి ఆలోచనలను పార్టీలో ఎంతమంది ఆమోదిస్తారన్న విషయం పక్కనబెడితే, బహిరంగంగా ధిక్కరించే వారు ఇప్పటికైతే లేరన్నది నిజం. అలాగే వివిధ రాష్ట్రాల్లో మోడిని సమర్ధించే ముఖ్యమంత్రులు ఎంతమందన్న విషయం తేలాల్సి వుంది. మిగితా రాష్ట్రాల సంగతి ఎలాగున్నా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం మోడిని సమర్ధిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాబట్టే ఏపి, తెలంగాణాల్లో గడువుకున్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాజాగా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో అసెంబ్లీ-పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలన్న ప్రధాని ప్రతిపాదనకు అంగీకారం తెలపటంతో ‘ముందస్తు’ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.