కర్నాటక దళిత ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రసాద్ లాగా,  పార్టీ మారినపుడు ఎమ్మెల్యే పదవిని తీసి అవతలి పడేసే దమ్ము  తెలుగు ఫిరాయింపు దారుల్లో ఒక్కరికి కూడా లేదా...

రాజకీయాల్లో మగవాళ్లు, అడవాళ్లు ఎవరయినా ఉండవచ్చు. అయితే, మొనగాళ్లు కొంతమందే ఉంటారు.

వాళ్ల గెలుపు ఓటమిల గురించి పెద్దగా తర్జన భర్జనలు పడరు. ముందు యుద్ధరంగంలోకి దూ కేస్తారు. ఎందుకంటే, గెల్చినా, ఓడినా మొనగాడిగానే కొనసాగుతారు.

కర్నాటక కు చెందిన ఎమ్మెల్యే వి. శ్రీనివాస ప్రసాద్ ఈ తరహా మొనగాడు. ఆయన మైసూర్ లోని నంజన్ గూడ్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ లోనే కాదు, గతంలో ఆయన బిజెపిలో, జనతాదళ్లో కూడా ఉన్నాడు. ప్రజల్లో అక్షరాల పలుకుబడి ఉన్న దళిత నాయకుడు. 

ఛామరాజనగర్ లోకసభ నుంచి అయిదు సార్లు లోక్ సభకు గెల్చి కేంద్రంలో మంత్రి అయ్యాడు. వాజ్ పేయి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశాడు. అంతకు ముందు పివితో విభేదించిన కాంగ్రెస్ వదిలేశాడు.

2008లో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాడు. మొన్న జూన్ దాకా ముఖ్యమంత్రి సిద్దరామయ్య క్యాబినెట్ లో మంత్రి. సిద్దరామయ్యం క్యాబినెట్ పుర్వ్యవస్థీకరణలో పదవులో పోయిన 14 మందిలో శ్రీనివాస్ ప్రసాద్ ఒకరు. దీనితో కోపం వచ్చి బిజెపిలో చేరాలనుకున్నారు. నిన్న యడ్యూరప్పను కలుసుకున్నారు. బయటకొచ్చాక జనవరి రెండో తేదీన బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.

అయితే, ఈ మధ్యలో ఏంచేశారో తెలుసా...

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామచేశారు. కాంగ్రెస్ టికెట్ మీద తెచ్చుకున్న ఎమ్మెల్యె పదవిని విసిరి కావేరి లో పడేశాడు. ఉప ఎన్నికల్లో గెల్చికళంకం లేకుండా అసెంబ్లీ కొస్తానని శపథం చేస్తున్నాడు. ఆయన బంపర్ మెజారీటితో గెలుస్తాడని కాంగ్రెసోల్లే చెబుతున్నారు.

ఇలా పార్టీ మారినపుడు ఎమ్మెల్యే పదవిని తీసి అవతలి పడేసే దమ్ము తెలుగు ఫిరాయింపు దారుల్లో ఒక్కరికి కూడా లేదా...

అంధ్రప్రదేశ్, తెలంగాణాలలో గత రెండున్నరేళ్ల లో కనీసం 40 మంది ఎమ్మెల్యేలు, మరొక డజన్ ఎమ్మెల్సీలు అపోజిషన్ పార్టీ వదిలేసి రూలింగ్ పార్టీల్లోకి దూకారు. వీరితో కొంతమంది మంత్రులయి బాగా ప్రజా సేవ చేస్తున్నట్లు పేపర్లో వస్తావుంది. రూలింగ్ పార్టీ బ్యాకింగ్ ఉంది. గవర్నమెంట్ అండా ఉంది. అయినా ఈ 50 మందిలో ఒక్కరికి కూడా ధైర్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెల్చే ధైర్యం లేదా...

రూలింగ్ పార్టీని సిగ్గులేకుండా అతుక్కుని ఉంటే శ్రీనివాస్ ప్రసాద్ నాలుగు రూకలు సంపాదించుకుంటూ ఉండవచ్చు. అలాకాకుండా అపోజిషన్ పార్టీలో చేరిపోయి, పై గా బైఎలక్షన్ లో రూలింగ్ పార్టీని ఓడిస్తానంటున్నాడు. నిజంగా దమ్మున్నోడు.