ఆ సీఎంలను చూసైనా ఈ సీఎంలు నేర్చుకోవాలి

Telugu CMs are wasting public money
Highlights

  • ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

 

నాడు రాజుల సొమ్ము రాళ్ల పాలయ్యేది.. ఇప్పుడు ప్రజల సొమ్ము పాలకుల పాలవుతోంది. నమ్మకాలు, హైటెక్కు హంగుల పేరుతో తెలుగు రాష్ట్రాల సీఎంలు కోట్లకొద్ది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

 

ఒక సీఎం వాస్తు బాగా లేదని రూ. 60 కోట్లు పెట్టి కొత్త ఇంటిని కట్టేసుకున్నారు. కులానికి ఒక భవనం కడుతానంటున్నాడు. సంబరాల పేరుతో కోట్లు కుమ్మరిస్తున్నాడు.

 

మరో సీఎం హైదరాబాద్ తమకు తాత్కాలిక రాజధాని అని తెలిసినా కోట్ల కొద్ది డబ్బును అక్కడే తగిలేస్తున్నారు. మరమ్మత్తులు, కొత్త హంగుల పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. కొత్త రాజధానిలో తాత్కాలికం పేరుతో ఖజానా ఖాళీ చేస్తున్నారు. విదేశీ ప్రయాణాలకు సొంతంగా విమానాలు అద్దెకు తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.  

 

ఇలా రెండు రాష్ట్రాల సీఎంలు దుబారా ఖర్చులు చేయడంలో, ప్రజాధనాన్ని సంక్షేమం కోసం మరిచి తమ క్షేమం కోసం వాడుకోవడంలో పోటీ పడుతున్నారు.


వీరిని చూసి పాలకులంతా ఇంతే అనుకుంటే పొరపాటే... ప్రజాధనాన్ని పవిత్రంగా భావించి నిరాడంబర జీవితంతో రాజకీయాలకు వన్నెతెచ్చిన సీఎంలు కూడా ఈ దేశంలో ఉన్నారు.

 

వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ గురించి. బిహార్ కు ఆయన మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి.  సోషలిస్టు పార్టీ నేత, జేపీ అనుచరుడుగా పేరున్న ఆయన నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.

 

కడు పేదరికం నుంచి వచ్చిన ఆయన.. సీఎం అయిన తర్వాత కూడా తన కుటుంబాన్ని అధికార నివాసానికి రానివ్వ లేదు. వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా పూరి గుడెసెలోనే ఉండేవారు.

 

సీఎంగా తన కుమారుడి పెళ్లిని కూడా అతి నిరాడంబరంగా జరిపించారు. దీనిపై అప్పటి గవర్నర్ తనను ఎందుకు మీ కుమారుడి పెళ్లికి ఆహ్వానించలేదని ప్రశ్నించగా.. మిమ్నల్ని ఆహ్వానించే ఆర్థికస్తోమత ఈ పూరిగుడెసె వాసికి లేదు. అందుకే పిలవలేదని కర్పూరి ఠాకూర్ తన అశక్తతను వ్యక్తం చేశారు.

 

భారత కమ్యూనిస్టు పార్టీ ముఖ్యనాయకుడు,  ప్రస్తుత త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ కూడా ఇలా నిరాడంబరంగా పాలన కొనసాగిస్తూ ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిస్తున్నారు. సీఎం గా తనకు వచ్చే జీతాన్ని పార్టీకే ఇచ్చి .. పార్టీ ఇచ్చే రూ. 5 వేలతో సర్దుకపోతున్నారు.

 

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, పాండిశ్చెరి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి కూడా ఇలా నిరాడంబరంగా పాలన కొనసాగించి ఎందరికో ఆదర్శంగా నిలిచినవారే.


వీరి నుంచి మన సీఎంలు కొంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

loader