అనుకోకుండా మోదీ తమిళనాడు పెద్దన్న అయ్యాడు. ఎఐడిఎంకె చీలిపోకుండా,పన్నీర్ సెల్వం పడిపోకుండా కాపాడతాడు. ఇది వచ్చే ఏడాది వెంకయ్యను రాష్ట్రపతిని చేసేందుకు అవసరమేమో.

భారతీయ జనతా పార్టీ కలలో కూడా వూహించనది ఇపుడు దక్షిణ భారత దేశంలో జరుగుతూ ఉంది. ద్రవిడ రాజకీయాలకు పుట్టినల్లయిన తమిళనాడులో తొలిసారి బిజెపికి కాలుమోపేందుకు జాడ దొరికింది. ఇది తెలుగు రాజకీయాలను కూడ ప్రభావితం చేసేలా ఉందని బిజెపిలో ప్రచారమవుతూ ఉంది.

ఎఐడిఎంకె నాయకురాలు జయలలిత చనిపోయాక తమిళనాడు రాజకీయాలలో ఒక పాత్ర పోషించే మహత్తర అవకాశం ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీకి దొరుకుతూ ఉంది. అక్కడి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా, పార్లమెంటులో తమిళనాడు నుంచి ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన జయలలిత మరణం ఈ పార్టీని తమిళ రాజకీయాలలో క్రియాశీల శక్తిగా మారుస్తున్నది.

ఒక వైపునుంచి తత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు, మరొక వైపు నుంచి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కనిపించకుండా హోంమంత్రి రాజ్ నాథ్ తమిళనాడు మీద కన్నేశారు. కేంద్ర నిఘాసంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగి రాజకీయ పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.

 ఇపుడు తమిళనాడు పెద్దన్న ప్రధాని మోదీయే.

ఎందుకంటే, జయలలిత మరణంతో ఎఐడిఎంకె పెద్ద దిక్కు కోల్పోయింది. డిఎంకె పావులు కదిపి ఎఐడిఎంకెని ఛిన్నాభిన్నం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఎఐడిఎంకె ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు బిజెపి సిద్ధమయింది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీలో చిచ్చు రగిలి 1987 నాటి పరిస్థితి తలెత్తకుండా నివారించేందుకు, పన్నీర్ సెల్వాన్ని, పార్టీని కాపాడేందుకు బజెపి, కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టాయని చెబుతున్నారు.

1987లో ఎంజి రామచంద్రన్ చనిపోగానే, ఆయన భార్య జానకి కొంత మంది ఎమ్మెల్యేలను వెనకేసుకుని ఎంజిఆర్ వారసత్వం డిమాండ్ చేసింది. జయలలితను దూరంగా తరిమేసింది. అపుడు జయలలితనుకాపాడింది నాటి ప్రధాని రాజీవ్ గాంధి. 21 రోజుల్లోనే జానకీరామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ అయింది. తర్వాత రాజీవ్ గాంధీ సహకారంతో జయలలిత ముఖ్యమంత్రి అయింది.

ఇపుడు పార్టీలో అలాంటి ముసలం పుట్టకుండా ఉండేందుకు, పన్నీర్ సెల్వం కు ఎలాంటి ఛాలెంజ్ ఎదురుకాకుండా ఉండేందుకు నరేంద్రమోడీ ముందుకు వచ్చారని చెబుతున్నారు, ఆయన తరఫున తెలుగువాళ్లు విద్యా సాగర్ రావు, వెంక్యనాయుడు పని చేస్తున్నారు.

దీని వల్ల రెండుప్రయోజనాలు నెరవేరతాయి. ఒకటి- తనను నిజమయిన ముఖ్యమంత్రిగా నిలబెట్టినందుకు పన్నీర్ సెల్వం బిజెపికి విధేయుడయి వుంటాడు. భవిషత్తులోమోదీకోసం దేనికయిన తెగిస్తాడు.

రెండు – ఎఐడిఎంకె పార్టీ వచ్చే ఏడాది దాకా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీకి 37 మంది ఎంపిలు లోక్ సభలో, 14 మంది రాజ్యసభలో ఉ న్నారు. వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికల పుడు బిజెపి తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఈ ఓట్లు అవసరం.

అందునా, వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అభ్యర్థి అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అపుడు ఆయన దక్షిణాది నుంచి ఎక్కవ వోట్లు తెచ్చకుని తీరాల్సిందే. తమిళ రాజకీయాలకు ఉన్న తెలుగు కోణం ఇది అని కొంతమంది బిజెపి నాయకులు చెబుతున్నారు.

అందువల్ల ఎఐడిఎంకె చీలిపోకుండా, డిఎంకె పార్టీ వలవిసరకుండా, పన్నీర్ సెల్వం మరొక నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా కొనసాగేబాధ్యత ను బిజెపి తీసుకుంది. పన్నీర్ సెల్వానికి, జయలలిత స్నేహితురాలు శశికళ ఎలాంటి సమస్య కల్గించకుండా బిజెపి నాయకత్వం కట్టుదిట్టమయిన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇందులో ప్రధానమయిన చర్య – అక్రమార్జన సంబంధించిన కేసులలెన్ని ఉన్నాయో శశికళకి కేంద్రం గుర్తు చేసిందట. లేకపోతే, 1987 లాగా రెండు వర్గాలు -పన్నీర్ సెల్వం, శశికళ వర్గం- బయలు దేరి పార్టీని పటాపంచలు చేపే ప్రమాదం ఉంది.

గెస్టు అర్టిస్టుగా కూడా అవకాశం లేని ద్రవిడ రాజకీయాలలో బిజెపికి ఇపుడు ప్రధాన పాత్ర దొరికింది.