Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కోదండరాం కొత్త స్టయిల్

కొత్త స్టయిల్ దుమ్ము రేపేనా...
telangana kodandaram new style

అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ జెఎసి ఛైర్మన్ రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన జారీ అయింది. తెలంగాణ రాజకీయ తెర మీదకు మరో పార్టీ రాబోతున్నది. కోదండరాం నేతృత్వంలో రాబోతున్న తెలంగాణ జన సమితి పార్టీ నూతన పంథా ను అనుసరిస్తున్నది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆ పార్టీ అడుగులు పడుతున్నాయి. ఆదిలోనే సరికొత్త పద్ధతిని అవలంభిస్తూ యావత్ తెలంగాణ జాతిలో కొత్త చర్చకు తెర లేపింది తెలంగాణ జన సమితి. ఆ వివరాలు ఏంటో కింద చదవండి.


తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రజల రాజకీయాల కోసం జెఎసి ఛైర్మన్ కోదండరాం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే ఎక్కువగా కొత్త రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ ప్రకటించడంతోటే ఎజెండా, జెండా ప్రకటించేసి కార్యాచరణ షురూ  చేస్తాయి. కానీ తెలంగాణ జన సమితి మాత్రం  కొత్త పంథా ఎంచుకుంది. తాము నెలకొల్పబోయే రాజకీయ పార్టీకి జెండాను ప్రజలే సూచించాలంటూ ఒక కొత్త ఒరవడిని లేవనెత్తింది. సోషల్ మీడియాలో జెఎసి ప్రతినిధులు పార్టీకి జెండాను సూచించాలంటూ ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. ఈ పోస్టులు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో వైరల్ గా అవుతున్నాయి. 
ప్రజల భాగస్వామ్యంతోనే జెండా రూపకల్పన సాగాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ జెఎసి ఈ రకమైన కార్యాచరణకు దిగినట్లు జెఎసి నేతలు చెబుతున్నారు. జెఎసి తలపెట్టిన ఈ కార్యక్రమానికి స్పందన కూడా పెద్దమొత్తంలోనే వస్తున్నది. జనాలు స్పందించి జెండా ఎలా ఉంటే బాగుంటుందో సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అంతిమంగా ఎక్కువ మంది అభిప్రాయం మేరకు జెండా రూపకల్పన చేసే అవకాశముందని చెబుతున్నారు. ఇక జెండా రూపకల్పన అయిన తర్వాత మిగతా ఎజెండాను కూడా ఇదే తరహాలో ప్రజల ద్వారా అభిప్రాయ సేకరణ చేసి ముందుకు సాగే చాన్స్ ఉందంటున్నారు. జెండా తయారైన తర్వాత రానున్న రోజుల్లో ఎజెండా కోసం కూడా పబ్లిక్ రెస్పాన్స్ తీసుకుని తయారు చేసే చాన్స్ ఉందని అంటున్నారు.
తెలంగాణ జెఎసి పార్టీ సరికొత్త చర్చను మాత్రం తెలంగాణ సమాజంలో లేవనెత్తిందన్న ప్రచారం ఉంది. జెఎసి ఇచ్చిన పత్రికా ప్రకటన కింద యదావిదిగా ప్రచురిస్తున్నాం చదవండి.
తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీకి జెండాను సూచించండి

జ్యోతీబా ఫూలే, డా. బీ.ఆర్. అంబేడ్కర్, కొమరం భీమ్, ప్రొ. జయశంకర్ ల స్ఫూర్తితో, తెలంగాణ సకల జనుల, సబ్బండ వర్గాల పక్షాన, ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఆశయాల సాధనకై ప్రొ. కోదండరాం నాయకత్వంలో వస్తున్న
తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీకి జెండాను సూచించండి.
**
ఈ క్రింది మూడు నమూనాలలో మీకు నచ్చిన దానిని ఎంపిక చేయండి.
జెండా రూపకల్పనలో కీలకాంశాలు:
జెండా మధ్యలోనున్న గుర్తు ఈ క్రింద పేర్కొన్న వాటిని సూచిస్తుంది:
(i)    అమరుల స్థూపానికి జన నివాళి: మధ్యలో ఉన్నది తొమ్మిది పూరెక్కలతో కూర్చిన అమరుల స్తూపం. చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజానీకం అమరులకు నివాళులను అర్పించడం సూచిస్తున్నది. 
(ii)    మధ్యలో ఉన్న బతుకమ్మ చుట్టూ ఆడుతూ తిరుగుతున్న తెలంగాణ ఆడపడుచులు. 
(iii)    ఉదయిస్తున్న సూర్యుని వెలుగులో ప్రగతిపధంలో పయనిస్తున్న తెలంగాణ జనం. 
(iv)    తెలంగాణలో ప్రతీ పండుగకు జనం గుమిగూడి ఆడుకునే ఆనవాయితీ. కోయ, గోండు, చెంచు, లంబాడా నృత్యాలు,  హింధు-ముస్లిం-క్రిష్టియన్ల అలాయ్-బలాయ్, పీరీల ఆల్వా ఆటలు, డప్పు, డోళ్లు, కోలాటాలు, జడ కొప్పులు మొదలైన సంస్కృతీ సాంప్రదాయాలను సూచిస్తుంది. 
(v)    తెలంగాణ ఆడపడుచులు ప్రతీ రోజూ ఇంట్లో, వాకిట్లో వేసుకునే ముగ్గులు. 

జెండాలో వాడిన రంగుల ప్రాధాన్యత:
(i)    పాలపిట్ట రంగు: తెలంగాణ ప్రజలకు పాలపిట్ట అత్యంత ప్రీతిపాత్రం. పాలపిట్ట రాష్ట్ర పక్షి. ఈ రంగు సత్యానికి, విజయానికి, ప్రశాంతతకు చిహ్నం. 
(ii)    ఆకుపచ్చ రంగు: ఈ రంగు ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి, పచ్చని పంటకు ప్రతీక. ఇంకా ప్రకృతికి, జీవన వైవిధ్యానికి, ప్రగతికి, అన్యోన్యతలను కూడా సూచిస్తుంది. 
(iii)    ఊదా రంగు: ఈ రంగు ప్రజల  అధికారానికి, ఆశయాలకు. ఆత్మాభిమానానికి, స్వతంత్రతకు, చిత్త శుద్ధికి, ఐకమత్యానికి చిహ్నం. 
(iv)    పసుపు పచ్చ రంగు: ఈ రంగు శుభానికి, స్పష్టతకు, ఆనందానికి, శక్తికి, ఆశావహ దృక్పధానికి, విశ్వాసానికి, గౌరవానికి సూచిక. 
(v)    తెలుపు: అన్ని రంగుల కలయికతో తెలుపు కనబడుతుంది. అన్ని వర్గాల కలయికను ఈ రంగు సూచిస్తుంది. ఈ రంగు శాంతికి, స్వచ్చతకు చిహ్నం.

Follow Us:
Download App:
  • android
  • ios