17ఏళ్ల బాలుడు..చోర కళలో ఆరి తేరాడు ఒకసారి పోలీసులకు చిక్కి.. కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించినా.. మారలేదు.  

చెడు అలవాట్లకు బానిసగా మారిన ఓ 17ఏళ్ల బాలుడు..చోర కళలో ఆరి తేరాడు. ఒకసారి పోలీసులకు చిక్కి.. కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించినా.. మారలేదు. మారకపోగా.. మరింత రెచ్చిపోయాడు. అసలు జరిగిందేమిటంటే..

 ఓ బాలుడు(17)... వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను మారు తాళాలతో చోరీ చేస్తున్నాడు. గతంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 10, మలక్‌పేట పీఎస్‌ పరిధిలో 7 చోరీలు చేసి పోలీసులకు చిక్కి జువనైల్‌ హోంకు వెళ్లి వచ్చాడు. అయినా అతని ప్రవృత్తిలో మార్పు రాకపోగా.. తాజాగా ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురి పీఎస్ ల పరిధిలోని డిమార్ట్‌, బిగ్‌బజార్‌ వంటి షోరూంల ముందు నిలిపి ఉంచిన బైకులను దొంగతనం చేశాడు. డిమార్ట్‌ షోరూం ముందున్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. ఎల్బీనగర్‌ క్రైం పోలీసులు మొత్తానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 15 బైకులను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగతనం చేసిన బైకులలో కొన్నింటిని అతని ఇంటి సమీపంలో, మరికొన్ని మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ముళ్ల పొదల్లో దాచి ఉంచగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిని మళ్లీ జువనైల్‌ హోంకు తరలించారు. స్వాధీనం చేసుకున్న బైకులలో ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలోవి 8 వాహనాలు కాగా.. ఒకటి మైలార్‌దేవులపల్లి ఠాణా పరిధిలోనిది. మిగతా బైకులు ఏ పీఎస్ పరిధిలోవో తెలుసుకోవాల్సి ఉంది.