ఫేస్‌బుక్‌పై మోజు తగ్గిందా? వేరే మార్గాలు వెతుకుతున్నారా!?

Teen Prefers YouTube, Instagram And Snapchat Than Facebook
Highlights

ఫేస్‌బుక్‌పై మోజు తగ్గిందా? వేరే మార్గాలు వెతుకుతున్నారా!?

మీ అందరికీ ఆర్కుట్ గుర్తుందా..? దాదాపు 13 ఏళ్ల క్రితం గూగుల్ సంస్థ స్థాపించిన ఆర్కుట్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసినదే. అప్పటి కుర్రకారుకి ఇదొక గొప్ప సోషల్ ప్లాట్‌ఫామ్. అయితే కాలక్రమేనా సరికొత్త సామాజిక మాధ్యమాలు పుట్టుకురావటంతో ఆర్కుట్‌కి ఆదరణ తగ్గి అంతరించిపోయింది. కాగా.. ఇప్పుడు ఫేస్‌బుక్ పరిస్థితి కూడా ఇంచు మించు అలానే ఉన్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్యూ రీసర్చ్ సెంటర్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఫేస్‌బుక్ వాడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని తెలిసింది. ప్రత్యేకించి అమెరికాలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందట. ఇక్కడి టీనేజర్లలో చాలా మంది ఫేస్‌బుక్‌కు గుడ్‌బై చెప్పి యూట్యూట్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వైపు దృష్టి సారిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

అమెరికాలో 2015లో దాదాపు 71 శాతం మంది టీనేజర్లు ఫేస్‌బుక్ వాడేవారని, ఇప్పుడు ఇది 51 శాతానికి తగ్గిపోయిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. మొత్తం 750 మంది యువతీ యువకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. టీనేజర్లలో ఇంతకు ముందు ఫేస్‌బుక్‌కు అత్యధిక ఆదరణ ఉండగా, ఇప్పుడు దీని స్థానాన్ని యూట్యూబ్ ఆక్రమించింది. టీనేజర్లలో 85 శాతం మంది యూట్యూబ్ వైపే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్ తర్వాతి స్థానాల్లో ఇన్‌స్టాగ్రామ్ (72 శాతం), స్నాప్‌చాట్ (69 శాతం) ఉన్నాయి.

అమెరికాలో 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్నవారిలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ వయసువారిలో 45 శాతం మంది దాదాపు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంటున్నారట. అమెరికా టీనేజర్లలో మూడేళ్ల క్రితం 73 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 95 శాతానికి పెరిగింది. కాగా.. ఈ సోషల్ మీడియా తమ జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని ప్రస్తావించగా.. దాదాపు 33 శాతం మంది సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పగా, 25 శాతం మంది ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. ఇకపోతే మిగిలిన వారు ఇవి తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని చెప్పారు.

loader