పిల్లలకు తల్లి, తండ్రుల తర్వాత గురువే దైవం అని పెద్దలు చెబుతుంటారు. ఇలా తమ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న విద్యార్థులను టీచర్లు తమ కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. కానీ కామారెడ్డి జిల్లాలో ఓ కీచక టీచర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకువచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

కామారెడ్డి మండలంలోని పెద్దఎక్లారం జడ్పీ ఉన్నత పాఠశాలలో విజయ్ కుమార్ అనే వ్యక్తి  ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యబుద్దులు నేర్పాల్సింది పోయి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇలా ఓ పదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ ప్రేమలేఖ రాసి పంపించాడు. ఈ లెటర్ ను చూసిన విద్యార్థిని ఈ విషయాన్ని నేరుగా తన తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు కలిసి స్కూల్ కి వెళ్లి ఈ కీచక టీచర్ ను పట్టుకుని చితకబాదారు. కొందరు గ్రామ మహిళలు ఈ టీచర్ పై చెప్పులతో దాడి చేశారు.

అనంతరం విజయ్ కుమార్ ను ఓ గదిలో బంధించిన గ్రామస్తులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన మండల విద్యాధికారి ఈ టీచర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.