తెలుగుదేశంపార్టీ ఎంపిలు నోరెత్తలేదు. కనీసం నిరసన కూడా తెలపకపోవటం నిజంగా దురదృష్టకరం. ఇటువంటి పరిస్ధితే గనుక ఇంకో రాష్ట్రం అంటే కర్నాటక, తమిళనాడు విషయంలో జరిగుంటే ఢిల్లీలో రాజకీయ పరిస్ధితులు ఈ పాటికి మరోరకంగా ఉండేది. కర్నాటక, తమిళనాడు విషయాల్లో కేంద్రం వేలు పెట్టినా, నిర్లక్ష్యం చూపుతున్నా వ్యవహారం ఏ విధంగా ఉంటుందో గతంలోనే ఆ రాష్ట్ర జనాలు కేంద్రానికి రుచి చూపించారు. కాబట్టి వాళ్ళ విషయాల్లో మాత్రం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తుంది.

ఇదంతా ఎందుకంటే, గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రయోజనాలకు సంబంధించి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీ సమస్యలేమీ లేవా? ప్రాజెక్టులేవీ పెండింగ్ లో లేవా? అంటే, ప్రాజెక్టులన్నీ పెండింగే. సమస్యలన్నీ అపరిష్కృతాలే. మరి బడ్జెట్లో ఎందుకని జైట్లీ ఒక్కమాట కూడా ప్రస్తావించలేదు?

కారణమేమిటంటే, ఏపి ప్రభుత్వం చేతకాని తనం. ఎంపిల్లో లోపించిన చిత్తశుద్ది, అనైక్యత. ఈ కారణాలనే కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం అవకాశంగా తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతీ బడ్జెట్లోనూ ఏపికి ఏదో వచ్చేస్తుందని ఎదురుచూడటం. చివరకు నిరాసపడటం మామూలైపోయింది.

ఈ పరిస్ధితికి బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవటమే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. చంద్రబాబునాయుడుకేమో ‘ఓటుకునోటు’ భయం. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికేమో సిబిఐ కేసుల భయం. మిగిలిన పార్టీలు సోదిలోకి కూడా లేవు. కాబట్టే ఏపి డిమాండ్ల విషయంలో కేంద్రం నిశ్చింతగా ఉంది. డిమాండ్లను పరిష్కరించినా పరిష్కరించకపోయినా పట్టించుకునే నాధుడు లేడన్నది కేంద్రానికి అర్ధమైపోయింది.

అదే సందర్భంలో అర్జంటుగా వచ్చే ఎన్నికల్లో భాజపా ఏమీ అదికారంలోకి వచ్చే పరిస్దితి ఏమీ లేదు. టిడిపితో ఉన్నా ఇంకెవరితో ఉన్నా తోక పార్టీ క్రిందే లెక్క. అందుకే సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం కూడా పట్టించుకోవటం లేదు. ఆ విషయం బడ్జెట్ సమర్పించే సమయంలో స్పష్టంగా కనబడింది. ఎలాగంటే, బడ్జెట్లో ఏపికి సంబంధించిన అంశాలేవీ ప్రస్తావన లేదని తెలిసీ ఎంపిలెవరూ కనీసం నోరు కూడా విప్పలేదు. అందరూ చోద్యం చూస్తూ కూర్చున్నారు. దాంతోనే తెలిసిపోతోంది ఏపికి కేంద్రం ఏపాటి ప్రాధాన్యత ఇస్తోందో.