చింతమనేని రచ్చకు.. ఆందోళన చేసిన యువకుడు

రాష్ట్ర ప్రభుత్వ విప్‌, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ హనుమాన్‌జంక్షన్‌లో రచ్చరచ్చచేశారు. ఆయన ఏలూరు నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో హనుమాన్ జంక్షన్ కి వచ్చారు. కాగా..అదే సమయంలో జంక్షన్‌ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మీద ఉన్న సంక్షేమ పథకాల ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రం చిరిగి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవరు, కండక్టరులను కిందకు దింపి అసభ్య పదజాలంతో దూషించారు. డిపోకు వెళ్లగానే సరిచేయిస్తామని వారు చెబుతున్నా.. వినకుండా బస్సులో ప్రయాణికులను దింపి వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు. ఇదంతా గమనిస్తున్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు అనవసరంగా సిబ్బందిని వేధించడం ఎందుకని ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు.

ఆగ్రహించిన చింతమనేని.. అతనిపై చేయి చేసుకున్నారు. సమాచారం తెలిసి జంక్షన్‌ ఎస్సై సతీష్‌ ఘటనా స్థలానికి వచ్చి ప్రభుత్వ విప్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు ప్రయాణికులను బస్సు దింపి వేరే బస్సుల్లో పంపారు. అనంతరం చింతమనేనివిజయవాడ వైపు వెళ్లి పోయారు. నాగేశ్వరరావుపై దాడి విషయం అతని స్నేహితులు, సామాజిక వర్గీయులకు తెలియడంతో వారు అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద గుమిగూడారు. వాహనాలను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ విషయమై రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇలా అనవసరపు రాద్దాంతాలు చేసి వార్తల్లోకి ఎక్కడం చింతమనేనికి ఇదేమి తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన ఇలా వార్తల్లోకి ఎక్కారు. అమరావతి సచివాలయం సమీపంలో గేదెలను మేపడం, ఇంటింటికీ టీడీపీ కార్యక్రమ ప్రచారానికి వెళ్లి.. వైసీపీ నేతల ఇళ్ల పై దాడి చేయడం లాంటి సంఘటనలు చింతమనేని చాలానే చేశారు.