జేసీ బ్రదర్స్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రజల్లోనూ, ప్రతిపక్షంలోనే  కాకుండా సొంత పార్టీ నేతల్లోనూ ఈ వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. ఎంతలా అంటే.. బహిరంగంగా మీడియా ముందు విమర్శించే స్థాయికి చేరుకుంది. ఇప్పటికే జేసీబ్రదర్స్ , టీడీపీలోని ఓ వర్గం ఉప్పు-నిప్పులా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఇతర నేతలు కూడా వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

గత మూడున్నరేళ్లుగా అనంతపురంలో రోడ్ల విస్తరణ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి కి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికీ వివాదం నడుస్తోంది. రోడ్ల విస్తరణ జరిపించాలని జేసీ ఎప్పుడు ప్రయత్నించినా.. ప్రభాకర్ చౌదరి.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో అడ్డుకుంటూ వస్తున్నారు. అంతెందుకు కమ్మ సామాజిక వర్గానికి తనకు పడటంలేదని ఓకానొక సందర్భంలో జేసీనే స్వయంగా చెప్పడం గమనార్హం. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచు మింటే ఇలానే ఉంది. ఆయనపైనా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయనను చూస్తేనే ప్రజలు భయపడే స్థాయికి చేరిపోయారనే వాదనలు వినపడుతున్నాయి.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ .. జేసీ బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ టీవీ ఛానెల్  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జేసీ బ్రదర్స్ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు కూడా చేయనున్నట్లు చెప్పారు. ఒకవైపు 2019 ఎన్నికలు మరెంతో దూరంలోలేవు. ఇలాంటి సమయంలో ఇంటా, బయటా జేసీ బ్రదర్స్ కి వ్యతిరేకత పెరిగిపోతే.. ఫలితాలు తేడా అయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలు వినపడుతున్నాయి.