ఓ వ్యక్తి స్వార్థానికి 150ఏళ్ల క్రితం నాటి చెట్టు బలి అయ్యింది. ఆ చెట్టు నీడన వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారవేత్తలు రోడ్డున పడ్డారు. నిన్నటి దాకా.. పచ్చగా కలకల లాడుతూ.. నలుగురికి నీడ పంచిన చెట్టు.. ఒక్కాసారిగా మోడులా మారిపోయింది.  ఇదంతా కేవలం రాత్రికి రాత్రే జరగడం గమనార్హం.  

అసలు విషయం ఏమిటంటే.. నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో కొన్ని సంవత్సరాలుగా ఒక సెంటు భూమి ఖాళీగా ఉంది. ఆ స్థలం ధర ప్రస్తుతం రూ.కోటి పలుకుతోంది. గత కొంతకాల వరకు చిరు వ్యాపారులు అక్కడే బిజినెస్ చేసుకునేవారు. అందుకు మున్సిపాలిటీ పన్నులు కూడా చెల్లించేవారు. ఇటీవల ఆ స్థలంపై అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ కన్నుపడింది. దానిని ఎలాగైనా కాజేయాలని భావించి.. ఆ వ్యాపారులను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ స్థలం తాను కొన్నానని చెప్పడం మొదలుపెట్టాడు. వ్యాపారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. వ్యాపారులు నాగమద్దిలేటి, లక్ష్మినారాయణలు.. ఎంత బతిమిలాడని పట్టించుకోలేదు.

 అంతేకాదు.. రాత్రికి రాత్రి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఆ కౌన్సిలర్ ప్లాన్ కూడా వేశాడు. అందుకు అక్కడున్న ఓ చెట్టు అడ్డుగా ఉందని.. రాత్రికి రాత్రి నరికేశారు. అప్పటి వరకు ఎన్నో పెళ్లిళ్లకు పచ్చని పందరిగా మారిన ఆ చెట్టు.. ఇప్పుడు పచ్చదనం కోల్పోయి ఉట్టి మోడులా మిగిలింది. 150 ఏళ్ల చరిత్రగల ఆ చెట్టును నరికివేయడం గ్రామస్థులను కలచి వేసింది.