జగ్గయ్యపేట మున్సిపల ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వైసీపీ శతవిధాల ప్రయత్నించి విఫలమైన టీడీపీ
‘జగ్గయ్యపేట..’ రాజధాని ప్రాంతంలో ఒక కీలక నియోజకవర్గం. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉంది. అలాంటి జగ్గయ్యపేటలో టీడీపీ ఎందుకు ఫెయిల్ అయ్యింది? రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే. కానీ ఒక మున్సిపాలిటీని గెలచుకోవడంలో విఫలమయ్యింది.
సాధారణంగా అధికార పార్టీకి ఒక మున్సిపాలిటీని గెలుచుకోవడం పెద్ద విషయమేమీ కాదు. నంద్యాలలాంటి నియోజకవర్గంలో ఉప ఎన్నిక పెడితే సులభంగా గెలిచిన టీడీపీకి ఒక మున్సిపాలిటీ గెలవడం నల్లేరు మీద నడకలాంటిది. అందులోనూ మంత్రి వర్గంలోని ముగ్గరు మంత్రులు ఈ జిల్లాకు చెందిన వారే. ఇద్దరు టీడీపీ మంత్రులు కాగా.. మరొకరు భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీకి చెందిన వారు. ఇంత బలం ఉంటే కచ్చితంగా గెలిచి తీరాలి. కానీ జగ్గయ్యపేట మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకోలేక పోయింది.
ఈ మున్సిపాలిటిలో మొత్తం 27 మంది కౌన్సిలర్లు ఉండగా.. 16 వైసీపీ, 10 టీడీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని, ఎమ్మెల్యే, ఎంపీ మద్దతు తీసుకున్నప్పటికీ టీడీపీకి 13 మంది సభ్యులే అయ్యారు. దీంతో..టీడీపీ కౌన్సిలర్లు.. వైసీపీ నేతలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అది కుదరక పొయ్యే సరికి ఎన్నిక అడ్డుకోవాలనుకున్నారు. వారు శతవిధాల ప్రయత్నించినా చివరికి ఎన్నిక జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఫార్ములానే ఇక్కడ కూడా ట్రై చేద్దామనుకున్నారు. కానీ వారి పప్పులు ఉడకలేదు. ఈ విషయంలో అధికారులు కూడా టీడీపీ నేతల మాటలు వినలేదు. ఇక గెలుపు అసాధ్యమని వారికి అర్థమైంది దీంతో వెంటనే వాకౌట్ చేశారు. మున్సిపల్ పదవిని వైసీపీ చేజిక్కించుకొంది.
అయితే.. జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలు ఈ మున్సిపాలిటీ విషయంలో పెద్దగా శ్రద్ధకనపరచలేదు. అందుకే అధికార పార్టీ ఫెయిల్ అయ్యింది అనే విమర్శలు వినపడుతున్నాయి.
