భవిష్యత్ విద్యుత్ వాహనాలదే. పర్యావరణ నియంత్రణ ఒకవైపు, ముడి చమురు పద్దు తగ్గుదల మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహన రంగంపై తన దృష్టిపెట్టడంతో వ్యాపార దిగ్గజాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఇటీవల కాలంలో విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం చేసిన అప్పులపై చెల్లించే వడ్డీకి ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించడం ఈ రంగంలో ఉత్సాహాన్ని నింపింది. ఇతర ఆటోమొబైల్ సంస్థలతో కలిసి విద్యుత్ మొబిలిటీ కోసం కలిసి పని చేస్తామని టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల చెప్పారు కూడా.

అంటే విద్యుత్ వాహనాల తయారీ రంగంలో తన వంతు పాత్ర పోషించేందుకు టాటా సన్స్, దాని అనుబంధ టాటా మోటార్స్ సిద్ధం అవుతున్నాయి. టాటా మోటార్స్ నేరుగా విద్యుత్ వాహనాల తయారీకి రంగం సిద్దం చేసుకుంటుండగా, ఆ వాహనాల వినియోగంలో విద్యుత్ వాడకానికి కీలకం బ్యాటరీ. రానున్న విద్యుత్ వాహనాలన్నింటిలోనూ లిథియం ఆయన్ బ్యాటరీలు వాడుతున్నారు.

ఈ లిథియం ఆయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి తాజాగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ‘టాటా కెమికల్స్‌’ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం గుజరాత్‌లోని ధలోర స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిలో రూ.4,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

ధలోరా ఇండస్ట్రియన్‌ సిటీ డెవలప్‌ మెంట్‌ ఎండీ జయప్రకాశ్‌ శివహరే మాట్లాడుతూ టాటా కెమికల్స్‌ ఇప్పటికే రూ.1,000 కోట్ల పెట్టుబడితో 126 ఎకరాలను కొనుగోలు చేసిందన్నారు. దీనిపై టాటా మోటార్స్‌ స్పందించేందుకు నిరాకరించింది.‘మేం ఎంతో ఆసక్తి చూపుతున్న రంగం ఇది. ఊహాజనిత ప్రచారం మేము స్పందించం’అని కంపెనీ పేర్కొంది. 

తొలిదశలో ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని జయప్రకాశ్ శివహారే చెప్పారు. ఈ ఉత్పత్తి యూనిట్ సామర్థ్యం 10 గిగా వాట్లు ఉంటుందని శివహరే తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన బ్యాటరీలను తయారు చేసే సంస్థలకు ఇన్సెంటివ్‌లను ఇచ్చేందుకు త్వరలో కేంద్రం విధానం అమల్లోకి తేనున్నదన్నారు. 

50 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా లిథియం బ్యాటరీల ఉత్పాదక రంగంలో తదుపరి పెట్టుబడులు పెరుగనున్నాయని శివహరే తెలిపారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తికి ధొలేరా ఐడియల్ డిస్టినేషన్ కానున్నదని పేర్కొన్నారు. 

ధలోరా స్పెషల్ ఇండస్ట్రీయల్ రీజియన్ పరిధిలో బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన కీలక ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే టాటా కెమికల్స్ సంస్థకు భూమి అప్పగించామని శివహరే తెలిపారు.

ఇక ముందు లిథియం బ్యాటరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలకు కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. అలాగే సదరు సంస్థలకు చౌకగా రూ.4.65 లకే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని కూడా తెలిపారు.