ఘుమఘుమలాడే బిర్యానీని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అందులోనూ హైదరాబాదీలకు బిర్యానీ అంటే మరీ మక్కువ ఎక్కువ. వారానికి ఒకటి రెండు సార్లు అయినా.. బిర్యానీ ని ఇష్టంగా లాగించేవారు నగరంలో చాలా మందే ఉన్నారు. అయితే.. కనీసం రూ.100 లేకుండా సింగిల్ ప్లేట్ బిర్యానీ దొరకడం ఈ మధ్యకాలంలో కష్టతరంగా ఉంది. అదే మంచి రెస్టారెంట్ కి వెళితే.. కనీసం రూ.200 నుంచి రూ.250దాకా చెల్లించక తప్పదు. కానీ.. మన హైదరాబాద్ నగరంలోనే ఘుమఘమలాడే, రుచికరమైన బిర్యానీ కేవలం రూ.10కే లభిస్తోంది. ఇదేదో.. ప్రభుత్వ పథకం కింద పెడుతున్న బిర్యానీ అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే.. ఈ బిర్యానీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఓ వ్యక్తి.. తక్కువ ధరకే అందరికీ బిర్యానీ అందించాలనే ఉద్దేశంతో  ఏర్పాటు చేసిన హోటల్  ఇది. ఇంతకీ.. రూ.10కే బిర్యానీ హోటల్ ఎక్కడ ఉందో చెప్పనే లేదు కదూ...అఫ్జల్ గంజ్ బస్టాండ్ ఆవరణలో.

 ఇంత తక్కువ ధరకే అందిస్తున్నారు.. రుచి బాగోదేమో..? పరిశుభ్రంగా ఉండదేమో..? అని సందేహాలు ఏమీ పెట్టుకోకండి. ఎందుకంటే.. ఇక్కడ రుచి, పరిశుభ్రతకి ఎక్కువ మార్కులు పడతాయి. దాదాపు 15 సంవత్సరాలుగా షేక్ అలీం అనే వ్యక్తి ఈ బిర్యానీ పాయింట్ ని నడుపుతున్నాడు. కొంత కాలం వరకు రూ.5కే బిర్యానీ అమ్మేవాడు. అయితే.. ధరలు మరీ పెరిగిపోవడంతో బిర్యానీ ధర ను రూ.10కి పెంచాడు. ప్రతి రోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఇక్కడ బిర్యానీ లభిస్తుంది. కాకపోతే.. కేవలం వెజ్ బిర్యానీ మాత్రమే దొరుకుతుందండోయ్. చికెన్, మటన్ బిర్యానీలకు ఇక్కడ చోటు లేదు. ప్రతి రోజూ ఇక్కడ 2వేల నుంచి 2,500మంది దాకా ఈ బిర్యానీని రుచి చూస్తున్నారు. అటువైపుగా వెళితే.. మీరు కూడా ఈ బిర్యానీని ఓ పట్టుపట్టండి.