ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన 2018వ సంవత్సర క్యాలెండర్ లో  తాజ్ మహల్ కి చోటు దక్కింది. 17వ శాతాబ్ధంలో నిర్మించిన ఈ తాజ్ మహల్ ని జులై నెల సమాచారంతో ప్రచురించారు.

తాజ్ మహల్ తో పాటు గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయానికి కూడా ఇందులో చోటు కల్పించారు. క్యాలెండర్ లోని ప్రతి పేజీలో బీజేపీ తమ స్లోగన్ కూడా చేర్చింది. ‘’ సబ్ కా సాత్, సబ్ కా వికాస్- యూపీ గౌవర్నమెంట్ కా సతత్ ప్రయాస్’’ అనే స్లోగన్ ని అందులో చేర్చారు. అంతేకాకుండా క్యాలెండర్ లో ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఫోటోలను కూడా పొందుపరిచారు.

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన సందర్భంగా ఇటీవల ఓ బుక్ లెట్ ని, క్యాలెండర్ ని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. అందులో తాజ్ మహల్ ని చేర్చడం రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయింది. దీంతో దీనిపై ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ దేశానికి మాయని మచ్చని, అక్బర్, బాబర్ లు దేశ ద్రోహులంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో తాజ్ మహల్ గత కొద్ది రోజులుగా వివాదంలో నడిచింది.

ఈ నేపథ్యంలో యూపీ రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి తాజ్ మహల్ సమాచారంతో క్యాలెండర్ ని ప్రచురించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం 370కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తాజ్ మహల్, ఆగ్రా పరిసర ప్రాంతాల్లోని పార్కులను ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు కూడా తెలిపారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం తాజ్ మహల్  అని. ఇది మన దేశ చారిత్రాత్మక స్మారక మని, దీని రక్షణ, పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ నెల 26న తాను తాజ్ మహల్ ని సందర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 యూపీ ప్రభుత్వం విడుదల 2018 క్యాలెండర్లో చోటు దక్కించుకున్న ప్రదేశాలను ఒకసారి చూస్తే.. ప్రయాగరాజ్ త్రివేణి సంగమం( అలహాబాద్), రామ్ కీ పౌదీ( అయోధ్య), బర్సానేకీ హోలీ( మధుర), గురుద్వారా నానక్మాతా సాహేబ్( పిలిభిత్), దేవగ్రహ్ జైన్ టెంపుల్(లలిత్ పూర్), సారనాథ్ స్తూప( వారణాసి), రాణి ఝాన్సీ కా ఖిలా( ఝాన్సీ), శ్రీ కృష్ణ జన్మస్థాన్ టెంపుల్( మధుర), వింద్యాచల్ ట్రికోన్ దర్శన్( మీర్జాపూర్), కాశీ విశ్వనాథ్ టెంపుల్( వారణాసి)