అర్జున అవార్డు గ్రహీత, 2012, 2016 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన టేబుల్ టెన్నిస్ ఆటగాడు సౌమ్యజిత్ ఘోష్‌పై అత్యాచారం కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బరసాత్‌కు చెందిన 18 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి కథనం ప్రకారం.. జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌ను పిన్న వయసులోనే అందుకున్న ఘోష్‌కు 2014లో ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. కాగా.. తామిద్దరం తరచూ కోల్‌కతాలోని సైమ్యజిత్ ఫ్లాట్‌లో  కలుసుకునేవాళ్లమని యువతి తెలిపింది .అంతేకాకుండా.. తనను పెళ్లి చేసుకుంటానని మాటకు ఇచ్చాడని దీంతో అతనికి శారీరికంగా కూడా దగ్గరయ్యానని తెలిపింది. సౌమ్యజిత్ కారణంగా తాను ఒకసారి గర్భం కూడా దాల్చానని అయితే.. అతని బలవంతంతో అబార్షన్ చేయించుకున్నట్టు చెప్పింది. అంతేకాదు, ఉత్తరబెంగాల్‌లోని ఓ ఆలయంలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. చివరికి తనను మోసం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. కాగా.. సౌమ్యజిత్ మాత్రం యువతి చేస్తున్న ఆరోపణలను ఖండించాడు. అవన్నీ అబద్ధాలంటూ తేల్చిచెప్పాడు. సౌమ్యజిత్ ఘోష్‌పై ఫిర్యాదు అందిందని బరసాత్ అదనపు ఎస్పీ అభిజిత్ బెనర్జీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.