మళ్లీ థియేటర్లలో ‘జనగణమన’.. సుప్రీంకోర్టు తాజా ఆదేశం దేశభక్తికి కూడా ఆర్డర్ ఆర్డర్ అనాల్సిందేనా పాలకులు, సెలెబ్రిటీలకే కరువైన దేశభక్తి పార్లమెంటులో గీతం ముగిసేదాకా ఎంపీలు ఆగుతారా
సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించాలని బుధవారం ఆదేశాలు జారీచేసింది. జాతీయగీతాన్ని, జాతీయ జెండాను దేశ పౌరులందరూ తప్పనిసరిగా గౌరవించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
జాతీయ గీతాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ భోపాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త శ్యామ్ నారాయణ్ చౌస్కీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పై విధంగా స్పందించింది. జాతీయగీత ప్రదర్శన సమయంలో థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరూ నిలబడే ఉండాలని సూచించింది.
చాలామందికి ఇప్పటికీ జాతీయగీతాన్ని ఎలా ఆలపించాలో తెలీడం లేదని సుప్రీం ఆవేదన వ్యక్తంచేసింది. అలాగే వ్యాపార సంబంధ టీవీ కార్యక్రమాల్లో మాత్రం దీన్ని వినియోగించకూడదని సూచించింది. జాతీయ గీతాన్ని ఎక్కడపడితే అక్కడ ముద్రించకూడదని పేర్కొంది. మరోవైపు సుప్రీం కోర్టు తాజా నిర్ణయంపై కేంద్రం స్పందించింది. రాష్ట్రాలకు వెంటనే ఈ విషయాన్ని తెలియజేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది.
సుప్రీం ఆదేశాలు ఇలా ఉంటే... వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. జాతీయ గీతాన్ని థియేటర్ లో ప్రదర్శిస్తున్నప్పుడు అంతా నిలబడి ఉండాలని కోర్టు ఆదేశిస్తోంది. కానీ... సగటు భారతీయునికి దేశ భక్తి లేక కాదు. పాఠశాలలో మనసారా జనగణమన పాడిన విద్యార్థికి కాలేజీ లో చేరగానే దేశభక్తి అంటే ఏంటో చూపిస్తున్నారు మన అధికార అవినీతి సామ్రాట్ లు. స్కాలర్ షిప్ అప్లై చేసుకునేందుకు.. ఇన్ కమ్ సర్టిఫికెట్ కావాలని ప్రభుత్వ కార్యాలయం తలుపు తడితే... అవినీతి ఆ సామాన్య విద్యార్థి నషాలానికెక్కుతోంది.
అక్కడే దేశభక్తి పునాదులు మరింత గట్టిపడుతున్నాయి. అలా గట్టిపడ్డ పునాదులు.. స్వాతంత్రోద్యమం నాటి దేశభక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అంతెందుకు.. దేశాన్ని ఏలుతున్న,ఏలిన ఎందరో రాజకీయ నేతలు కూడా జాతీయ జెండాను అవమానపరిచి తమదైన దేశభక్తి చాటినవారే.
జాతీయ జెండాతో చెమటలు తుడుచుకున్న రాజకీయ ఘనుడికి ఎంత దేశభక్తి ఉందో, జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగరేసిన నేతలకు ఎంత దేశభక్తి ఉందో.. అంతకన్నా ఎక్కువే సగటు భారతీయునికి ఉంది. ఇక రాజకీయ నేతల పరిస్థితి ఇలా ఉంటే మేమేమన్నా తక్కువ తిన్నామా అంటున్నారు సెలెబ్రిటీలు. ఏదో పబ్లిసిటీ మాయాజాలం పుణ్యమా అని... క్రీడాకారులను రాత్రికిరాత్రే సెలెబ్రిటీలను చేస్తుంటే... వచ్చే సంపాదనతో ఒళ్లుమరచి ప్రవర్తించిన వారినీ చూస్తున్నాం. ఓ టెన్నిస్ క్రీడాకారిణి జాతీయ జెండాకు బూటుకాళ్లతో అవమానపరిచిన ఘటన సగటు దేశభక్తిగల పౌరున్ని కలచివేస్తూనే ఉంటుంది. ఇలా దేశభక్తి చాటుకున్న మహానుభావులు, సెలెబ్రిటీలు ఎందరో..
మరి ఇలాంటి దేశభక్తులకు ఏథియేటర్ లో జాతీయగీతం వినిపిస్తే ఏం లాభం.. సుప్రీం ఇచ్చిన తాజా తీర్పుతోనైనా ప్రతిఒక్కరిలో దేశభక్తి మరింత పెరగాలని ఆశిద్దాం. జై భారత్ మాతా.. జైజా భారత్ మాతా..
