Asianet News TeluguAsianet News Telugu

లాలూ మీద దాణా కుట్ర కేసు తప్పదు: సుప్రీం కోర్టు సంచలనం

  • బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పశువుల దాణా కుంభకోణం కేసుల్లో కుట్ర అభియోగం ఎదుర్కోవలసిందే.  
  • కుట్ర కేసును ’చాలా ప్రాధాన్యమైనది’గా భావించాలి.    
  • ఆరు నెలల్లోగా దాణా కుంభకోణం కేసులన్నింటా విచారణ పూర్తిచేయాలి.
Supreme Court say lalu has to face conspiracy charges in fodder case

బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పశువుల దాణా కుంభకోణం కేసుల్లో కుట్ర అభియోగం ఎదుర్కోవలసిందేనని సుప్రీంకోర్టు సోమవారంనాడు తీర్పు చెప్పింది.

 

పశువుల దాణా కుంభకోణానికి సీబీఐ వేసిన నాలుగు కేసుల్లో ఆయనను విచారించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాదు,  జార్ఖండ్‌ హైకోర్టు లాలూకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టింది. మరొక ముఖ్య విషయం, హై కోర్టు తీర్పు మీద అప్పీలుకు వెళ్లడంతో  జాప్యం చేసినందుకు  సీబీఐని కూడా కోర్టు చివాట్టు పెట్టింది.


ఈ కుట్ర కేసును ’చాలా ప్రాధాన్యమైనది’గా భావించాలని సీబీఐ చీఫ్‌కు సూచిస్తూ  ఆరు నెలల్లోగా దాణా కుంభకోణం కేసులన్నింటా విచారణ పూర్తిచేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది.


లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన పశువుల దాణా కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే. నాలుగు కేసులను నమోదుచేసింది. వీటిల్లో ఒక కేసుకు సంబంధించి 2013లో ట్రయల్‌ కోర్టు లాలూ ప్రసాద్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. బెయిలు మీద బయటికి వచ్చిన లాలూకు 2014లో జార్ఖండ్‌ హైకోర్టులో ఊరట లభించింది. ఐపీసీ సెక్షన్‌ 120, 120B, 409, 420, 471, 477, 477A,  13(2)ల కింద సీబీఐ లాలూపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఒక సారి శిక్ష అనుభవించిన వ్యక్తి మీద అదే నేరాల మీద మరొక సారి విచారణ కుదరదు అని కోర్టు పేర్కొంది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ విచారణకు నేడు కోర్టు అంగీకారం తెలిపింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios