యడ్యూరప్ప రాజీనామా: సుప్రీంకోర్టుదే కీలక పాత్ర, వ్యూహాత్మకంగా కాంగ్రెసు

యడ్యూరప్ప రాజీనామా: సుప్రీంకోర్టుదే కీలక పాత్ర, వ్యూహాత్మకంగా కాంగ్రెసు

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం వెనక కీలకమైన పాత్ర సుప్రీంకోర్టు తీర్పేనని చెప్పవచ్చు. బలనిరూపణకు యడ్యూరప్పకు 15 రోజులు గడువు ఇవ్వగా, ఆ గడువును పూర్తిగా తగ్గించడం ద్వారా సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషించింది.

సుప్రీంకోర్టుదే కీలకమైన పాత్ర అని కాంగ్రెసు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా అన్నారు. అంతేకాకుండా, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే కాంగ్రెసు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.

అతి పెద్ద పార్టీగా బిజెపి అవతరించిన మరుక్షణం జెడిఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేయడం కాంగ్రెసు వ్యూహం తొలి అడుగు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవీ ప్రమాణం చేసిన తర్వాత కూడా కాంగ్రెసు వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.

శాసనసభ్యులను బెంగళూరు నుంచి హైదరాబాదు తరలించడం, తిరిగి బెంగళూరుకు తరలించడంలో కాంగ్రెసు నేతలు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది.

గాలి జనార్దన్ రెడ్డి ఆడియో టేపులను విడుదల చేయడం, బలనిరూపణకు ముందు యడ్యూరప్ప ఆడియో టేపులను విడుదల చేయడం వంటి చర్యలు కాంగ్రెసు, జెడిఎస్ లకు కలిసి వచ్చాయి. తమ చేతి నుంచి జారిపోతారని భావించిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో కూడా కాంగ్రెసు నేతలు చాలా పకడ్బందీ వ్యవహారం నడిపారు. 

కాంగ్రెసు సీనియర్లు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో జెడిఎస్ సభ్యులు జారిపోకుండా కూడా చాలా వరకు కాంగ్రెసు నేతలే చర్యలు తీసుకున్నారు. మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను బిజెపి తన వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడం చాలా వరకు కలిసి వచ్చింది. 

రేవణ్ణ పదవి కోసం ఆరాటపడకుండా కుమారస్వామిని బలపరుస్తూ ప్రకటన చేయడమే కాకుండా, జారిపోతారని భావించిన ఎమ్మెల్యేలను కూడగట్టడంలో కూడా కీలక పాత్ర పోషించారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page