స్టీల్ ప్లాంటు భిక్ష కాదు రాయ‌ల‌సీమ బిడ్డ‌ల హ‌క్కుఅని దాదాపు 20 వేల మంది విద్యార్థులు, ప్రొద్దుటూరు ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. స్టీల్ ప్లాంటు సాధ‌నా స‌మితి అధ్యక్షులు జీవి.ప్ర‌వీణ్ కుమార్‌రెడ్డి అధ్వర్యంలో సాగిన  మార్చ్ ఫ‌ర్ స్టీల్ ప్లాంటు లో పాల్గొన్న ప్రజల నినాదాలతో ప్రొద్దుటూరు పట్టణం బుధ‌వారం నాడు మార్మ్రోగి పోయింది.గాంధీరోడ్డులోని వ‌న్‌టౌన్ స‌ర్కిల్ నుంచి గాంధీరోడ్డుమీదుగా టిబి రోడ్డు, రాజీవ్ స‌ర్కిల్ నుంచి శివాల‌యం స‌ర్కిల్ వ‌ర‌కు భారీ ర్యాలీ సాగింది. అనంత‌రం పుట్ట‌ప‌ర్తి స‌ర్కిల్‌లో  బ‌హిరంగ స‌భ‌ జరిగింది.

అక్కడ  ప్ర‌వీణ్‌రెడ్డి మాట్లాడుతూ  రాయ‌ల‌సీమకు తీవ్ర‌మైన అన్యాయాల గురించి వివరించారు. ఎన్ని అన్యాయాలు  జ‌రుగుతున్నా రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఒక్క రాజ‌కీయ నాయ‌కుడూ మాట్లాడ‌క‌పోవం పట్ల  దుర్మార్గ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

‘‘అనంత‌పురంకు ఎయిమ్స్ ఇస్తామ‌న్న చెప్పి దాని ఊసే లేకుండా చేశార‌ు. అలాగే క‌డ‌పకు ఉక్కు ప‌రిశ్ర‌మ ఇస్తామ‌ని చెప్పి కాల‌యాప‌న చేస్తున్నార‌ు. వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి ప్ర‌త్యేక ప్యాకేజీ అని చెప్పిమోసం చేస్తున్నార‌ు.  ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ప్పుడు అన్ని రాజ‌కీయ పార్టీలు వారివారి ల‌బ్ధికోసం ఏకమైన విషయం గుర్తు చేస్తూ,  రాయ‌ల‌సీమ‌కు రావాల్సిన స్టీల్ ప్లాంటు విష‌యంలో ఇదే రాజ‌కీయ పార్టీలు ఎందుకు ఏకం కావో చెప్పాల‌ి,’’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాజ‌కీయ పార్టీల‌కు చిత్త‌శుద్ది ఉంటే స్టీల్ ప్లాంటు ఉద్య‌మం పుట్టిన ప్రొద్దుటూరు న‌డిబొడ్డున మేం ఏర్పాటు చేసే అఖిల‌ప‌క్ష స‌మావేశానికి హాజ‌రై ఏకగ్రీవ తీర్మానం చేసి ప్ర‌భుత్వాల‌పై వ‌త్తితి తేవాల‌ని, కేవ‌లం ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల‌తో కాల‌యాప‌న చేయ‌డం స‌రికాద‌న్నారు.  ఉక్కు ప‌రిశ్ర‌మ‌కోసం పోరాడే రాజ‌కీయ పార్టీల‌కు ఉక్కు సైనికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా స్టీల్ ప్లాంటు కోసం పోరాటం చేస్తున్నామ‌ని, రాయ‌ల‌సీమ బిడ్డ వ‌ల‌స‌లు పోయి ఎక్క‌డో బానిస బ‌తుకు బ‌త‌కూడ‌ద‌న్న ఉద్దేశ్యంతోనే పోరాటం చేస్తున్న‌ట్లు ప్ర‌వీణ్‌రెడ్డి వివరించారు. ఇక్క‌డ జీవించే ప్ర‌తి బిడ్డా త‌లెత్తుకుని కాల‌ర్ ఎగిరేసుకుని జీవించే ప‌రిస్థితి రావాల‌న్న ఆశ‌యంతోనే ప‌నిచేస్తున్నామ‌న్నారు. ప్రొద్దుటూరులో ప‌దిమందితో మొద‌లైన ఈ ఉద్య‌మం నేడు వేలాది మందితో ల‌క్ష‌లాది మందితో ఉదృత‌మైంద‌ని గుర్తుచేశారు. ఇందుకు కార‌ణం తాను స్టీల్ ప్లాంటు సాధ‌నా స‌మితిలో ఒక్క ఉక్కు సైనికున్ని మాత్ర‌మేన‌ని చెప్పారు. స్టీల్ ప్లాంటు సాధించే వ‌ర‌కు ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని ఏ ఉక్కు సైనికుడు ఏం చెప్పినా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయ‌మని ఒక‌వైపు ఉద్య‌మం చేస్తుంటే మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంటు ఏర్పాటు సాధాసాధ్యాల‌పై కమిటీ వేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ప్టీల్ ప్లాంటు వ‌ల్ల ప్ర‌యోజ‌నం, లాభాలు లేక‌పోతే బ్ర‌హ్మ‌ణీ సంస్థ ఇక్క‌డ ప‌రిశ్ర‌మ పెట్టేందుకు ఎందుకు ముందుకు వ‌స్తుంద‌ని, ఈ క‌నీస విష‌యాల‌ను గుర్తించ‌కుండా క‌మిటీ వేయ‌డం దారుణ‌మ‌న్నారు. వ‌చ్చిన క‌మిటీ ఏం చేసిందో చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిజాయితీగా స్టీల్ ప్లాంటు ఉద్య‌మం చేస్తున్నా మాపై కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్నారు. చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేసే వ్య‌క్తిన‌ని, స్టీల్ ప్లాంటు కోసం కుటుంబాన్నైనా త్యాగం చేసి పోరాడుతాన‌ని పేర్కొన్నారు.

ఏ ఒక్క‌రి ద‌గ్గ‌రా ఏమీ ఆశించ‌కుండా స్వంత డ‌బ్బుల‌తో ఉద్య‌మం చేప‌డుతున్నామ‌న్నారు. ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాము త‌ప్ప మ‌రో ఆలోచ‌న మా మ‌దిలో లేద‌న్నారు. ప్రొద్దుటూరును స్టీల్ సిటీ అయ్యేంత వ‌ర‌కు పోరాటం ఆపేది లేద‌న్నారు. రాయ‌ల‌సీమ త‌ల్లికి పుట్టిన బిడ్డ‌లైతే రాజ‌కీయాల‌కు అతీతంగా స్టీల్ ప్లాంటు కోసం త‌న‌లాగే రోడ్డెక్కి నిన‌దించాల‌ని, ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల‌ని ఆయ‌న రాజ‌కీయ పార్టీల‌కు పిలుపునిచ్చారు. ప‌ట్ట‌ణంలోని వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌తినిధులు, ప్ర‌జాసంఘాలు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, ఐఎంఏ, ఇత‌ర సంస్థ‌లు మ‌ద్దుతు ఇచ్చి పాల్గొన్నాయి.