రెండో తెలంగాణా యుద్ధమొచ్చేలా ఉంది...

state is all set for second Tmovement
Highlights

ప్రత్యేక రాష్ట్రం కోసం ఆంధ్రపాలకులకు, తెలంగాణా ప్రజలకు మధ్య  మొదటి తెలంగాణా యుధ్దం వస్తే, తెలంగాణాఎలా ఉండాలనే దానిపై టిఆర్ఎస్ కు, టిజాక్ కు మధ్య  రెండో యుద్ధం జరిగేలా ఉంది.

తెలంగాణాలో  మరొక పెద్దరాజకీయ యుద్ధానికి రంగం సిద్దమవుతూ ఉంది.

 

మొదటి యుద్ధం ఆంధ్ర పాలకులకు (ప్రొఫెసర్ కోదండరామ్ మాట),  తెలంగాణా ప్రజలకు మధ్య ఒకటిన్నర దశాబ్దం పాటు జరిగింది.  ఇపుడు తెలంగాణా ఎలా ఉండాల, టిఆర్ ఎస్ కోరినట్లా లేక తెలంగాణాజెఎసి భావిస్తున్నట్లా?  దీనికోసం టిఆర్ఎస్, టిజాక్ మధ్య యుధ్దానికి రంగం సిద్ధమవుతూ ఉంది.

 

కాంగ్రెస్, తెలుగుదేశం లతో కూడిన ప్రతిపక్షం కంటే, టిజెఎసి ఛెయిర్మన్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు, రూలింగ్ పార్టీ టిఆర్ఎస్ కు కొరకరాని కొయ్య అవుతున్నారు.


ప్రతి రోజూ యుద్ద  సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. రానున్న యుద్ధానికి తలపడేందుకు కోదండరామ్ సైన్యాన్ని సన్నద్ధం చేసుకుంటూ వూరూర ఉన్నటిజాక్ లను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఆయన చుట్టు యువకులంతా చేరుతున్నారు. చాలా మంది మేధావులు కెసిఆర్ వైపు చేరుతున్నట్లు కనిపిస్తున్నది. కెసిఆర్ మీద కోదండరామ్ దాడి పరోక్షంగా నైనా తీవ్రం చేస్తున్నారు.

 

టిఆర్ ఎస్ నేరుగా కాకుండా జూనియర్ ఎంపి బాల్కసుమన్ తో ప్రొఫెసర్ కు  వార్నింగ్ లు ఇప్పిస్తూ ఉంది.

 

ఏదో ఒక రోజు ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పేరెత్తక తప్పదు. కెసిఆర్ కూడా ఆయన్ని పర్మెనెంట్ గా  ఇగ్నోర్ చేయలేని పరిస్థితి రాకమానదు.

 

తాజాగా కోదండ్ రామ్  వైద్యం బాగా లేకపోతే, డాక్టర్ ని మార్చాల్సి వస్తుందని అన్నారు. అంటే, పరిపాలన బాగా లేకపోతే, ముఖ్యమంత్రి ని మార్చాల్సి వస్తుందని హెచ్చరిక చేయడమేకదా.

 

‘పాలన అనేది పాలకుల ఇష్ట ప్రకారం కాదు, ప్రజల అవసరాలకు తగినట్లుండాలి. ఒక డాక్టర్ మందు ఇవ్వకుంటే ఇంకొక డాక్టర్ దగ్గిరకుపోకుండా ఉంటామా. ఇపుడున్న డాక్టర్ వైఖరి మార్చుకుంటారని ఆశిస్తున్నా. డాక్టర్ వైఖరి మారకుంటే ఏమయితదో మీరే చూస్తరు,’ నిన్న హైదరాబాద్ లో కోదండరామ వార్నింగ్ ఇచ్చారు.

 

 సోమవారం నాడు టిఆర్ ఎస్ నుంచి అంతే గట్టిగా  జవాబొచ్చింది. పెద్దపల్లి  ఎంపి బాల్కసుమన్ టిఆర్ఎస్ రంగంలోకి దింపింది.

 

‘తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కోదండరాం దుష్ఫ్రచారాన్ని టీఆర్‌ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలి.   తీరును మార్చుకోకపోతే కోదండరామ్ భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోదండరాం కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలి,’ అని హెచ్చరించారు.
 

లక్ష మంది కోదండరామ్‌లు అడ్డుపడ్డా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.

 

ద్వితీయ  తెలంగాణా యుద్ధం జరిగేలా కనిపించడం లేదూ...

loader