దేశరక్షణ కోసం 6టన్నుల బంగారాన్ని ఇచ్చిన నిజాంలండన్ , పారిస్ లలో నిజాం సంపదన తెచ్చేందుకు కృషి చేస్తానన్న కేసీఆర్
లండన్, ప్యారిస్ దేశాలలో ఉన్న నిజాం( హైదరాబాద్ పాలకులు) సంపదను తిరిగి పొందేందుకు కృషి చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నాంపల్లి హజ్ హౌజ్ నుంచి బయలు దేరిన హజ్ యాత్ర -2017 యాత్రికుల బృందం బస్సును మంగళవారం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్ కి పూర్వం నిజాం ప్రభువు చాలా చేశారన్నారు.
1962లో భారత్ -చైనా యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కోరిక మేరకు నిజాం ప్రభువు 6టన్నుల బంగారాన్ని దేశ రక్షణ కోసం భారత ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. లండన్, ప్యారిస్ లలో ఉన్న నిజాం ఆస్తులను తిరిగి పొందేందుకు కృషి చేస్తామన్నారు.
1927వ సంవత్సరంలో మహాత్మాగాంధీ హైదరాబాద్ నగరాన్ని సందర్శించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అప్పడు ఆయన హైదరబాద్ నగర ప్రజల జీవనవిధానాన్ని, పాలకులను పొగిడారని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాంతం నుంచి భారత్ లోని మిగిలిన ప్రాంత ప్రజలు చాలా నేర్చుకోవాలని గాంధీ అన్నారని ఆయన తెలిపారు.
గత 50ఏళ్లతో పోలిస్తే.. మూడేళ్ల నుంచి నగరం శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని చెప్పారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ఏడాది రూ.1,250కోట్లు బడ్జెట్ లో కేటాయించామని చెప్పారు. ఇది తక్కవేనని.. భవిష్యత్తులో రూ.12వేల కోట్లు కేటాయించడమే తన లక్ష్యమని కేసీఆర్ వెల్లడించారు.
