అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త రికార్డు సృష్టించారు. ఇలాంటి రికార్డు బహుశా ఇండియాలో ఇదే కావచ్చు. నియోజకవర్గంలో కాలు పెట్టక ఎనిమిది నెలలయింది. నియోజకవర్గాన్ని వదిలేశారు, అక్కడ కార్యకర్తలను వదిలేశారు, అయితే, ఎమ్మెల్యే పదవిని మాత్రం దగ్గిరుంచుకుని విదేశాలలో సినిమా షూటింగులలో బిజిబిజి ఉంటున్నారు. చదవండి...

 అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త రికార్డు సృష్టించారు. ఇలాంటి రికార్డు బహుశా ఇండియాలో ఇదే కావచ్చు. ఆయన నియోజకవర్గంలో కాలు పెట్టక ఎనిమిది నెలలయింది. నియోజకవర్గాన్ని వదిలేశారు, అక్కడ కార్యకర్తలను వదిలేశారు, అయితే, ఎమ్మెల్యేపదవిని మాత్రం దగ్గిరుంచుకుని విదేశాలలో సినిమా షూటింగులలో బిజిబిజి ఉంటున్నారు. చివరకు పిఎ అక్రమాలతో పార్టీ తగలబడుతున్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.ఎపుడో గత ఏడాది నవంబర్‌లో జనచైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. అంతే, అదే చివరి దర్శనం.

ఆ తర్వాత పత్తా లేరు. నియోజకవర్గం ఏమయింది, ప్రజలెట్లున్నారు, సమస్యలే మిటి? వేసవిలో నీళ్ల కొరత ఎలా ఉంది అనే విషయాలు ఆయనకు గుర్తుంటాయనుకోం. ఇక్కడేమో వేసవిలో ప్రజలు ఆగుక్కెడు నీటి కోసం ప్రజలు గగ్గోలు పెట్టారు. ఇలా విదేశాలకు ఎగిరిపోక ముందు కూడా ఆయనేం ఇక్కడ వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఎపుడయినా వచ్చినా, ప్రతిసారీ పోలీసులు, నాయకుల హడావుడి, ఆర్భాటపు ప్రారంభోత్సవాలు, రోడ్డుషోల గోల గోల . ప్రజలతో సమావేశమయి వారి బాగోగులను అడిగి తెలుసుకునేందుకు నాలుగూర్లు తిరగడం, పట్టణంలో ఎక్కడయిన సంచరించడం వంటి సందర్భాలు లేవు.

ఇపుడు సడన్ గా ఈ నెల 23న బాలయ్య వస్తున్నారంటూ నేతల హడావుడి మొదలైంది. ఇది నిజమా, చాలా మంది నమ్మడం లేదు. సరైన సమాచారం లేదు. మినీమహానాడుకే హాజరుకాని ఎమ్మెల్యే.. ఇపుడు వస్తారా? రాకుండా ముఖం చాటేస్తారా?

2017 జనవరిలో హిందూపురం నియోజకవర్గంలో జరిగే ‘జన్మభూమి’ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటారని పెద్ద ఎత్తున తమ్ముళ్లు ప్రచారం చేశారు. కార్యక్రమాలు జరిగిన పది రోజులూ అదుగో వచ్చే,ఇదిగో వచ్చే అన్నారు. ఎమ్మెల్యే మాత్రం హాజరు కాలేదు. 

జనవరి 23న నీటి నియోజకవర్గంలో జాతీయ కరువు బృందం పర్యటించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరై తమతమ ప్రాంతాల్లో తాండవిస్తున్న కరువు,మంచినీటి సమస్య, పశుగ్రాసం కొరత వంటి సమస్య ల మీద నివేదికలు సమర్పించారు. అయితే బాలకృష్ణ ఒక్కరే హాజరు కాలేదు.

ఆయన చేపట్టిన ఒకే ఒక కార్యక్రమం. హిందూపురంలో చెలరేగిన టిడిపి అసమ్మతిని చల్లబరిచేందుకు చర్చలు జరపడం.మాజీ ఎమ్మెలే సీసీ వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ బాలకృష్ణ పీఏ శేఖర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పెద్ద బహిరంగ సభలు పెట్టారు. టిడిపికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అపుడు ఫిబ్రవరి 28న అసమ్మతి నేతలను హైదరాబాద్‌కు రప్పించుకుని బాలయ్య చర్చలు జరిపారు. ఇపుడేమో రేపు బాలయ్య వస్తున్నాడని టిడిపి వాళ్లు ప్రచారం చేస్తున్నారు.