శ్రీకాకుళం జిల్లాలో వార్ జోన్ ఒకటి తయారయింది ఎవరు తిరగబడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులను దించారు వూర్ల మీద రోడ్ల మీద కన్నేసి ఉంచేందుకు డ్రోన్ లు తిరుగుతున్నాయి దారిపోడుగునా పోలీస్ పికెట్లు అక్షర్రమ్ముక్క తెలియని రైతుల మీద ఎందుకు ఇలా యుద్దం ప్రకటించారు?
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఏంజరుగుతున్నదో తెలుసా.

చుట్టు పక్కల పల్లెటూర్లలో, ఆ జనం ఎపుడూ చూడని డ్రోన్లు గాలిలో తిరుగుతున్నాయి. అవెందుకు అలా తమ ఇళ్లమీద, వూరిమీద కన్నేశాయో అక్కడి గ్రామస్థులకు మొదట తెలియదు. వాటినెపుడూ చూడలేదు కూడా. అసలవేంటో కూడా తమకు తెలియదని చెబుతున్నారు.
అక్కడ తులగాం అనే గ్రామం ఉంది. వూరు చిన్నదే అయినా జనాభా కంటే ఎక్కువ మందిపోలీసులు అక్కడ తిష్టవేశారు. మనుషులెవరూ రోడ్ల మీద కనిపించకుండ తరిమేస్తున్నారు. రోడ్డ పొడవునా చాలా చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు రహదారులను ఇనుప ముళ్ల తీగెలతో నిర్బంధం చేశారు. ఇదంతా చూస్తే, అక్షరమ్ముక్క రాని ఈ పల్లెటూరి ప్రజలమీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందా అనిపిస్తుంది.
ఇంత హంగామా ఎందుకు?
వంశధార జలాశయం నిర్మాణ పనులు మొదలుపెట్టాలి. కట్టుదిట్టమయన పోలీసుల కాపలా మధ్య మంగళవారం ఈ పనులు ప్రారంభమయ్యాయి.వంశధార జలాశయం గట్టు నిర్మాణానికి 'వె' ప్రాంతంలో తులగాం గెడ్డ గట్టును కలిపేందుకు మట్టి పూడ్చే పనులను అధికారులు చేపట్టారు. తులగాం నిర్వాసిత గ్రామం సమీప భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి నిర్మాణ పనుల కోసం వినియోగిస్తున్నారు. ఈ సందర్భగా తమకు సరయిన పరిహారం చెల్లించాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అందువల్ల ఈ రహదారుల్లో ప్రజలు రోడ్డెక్కి గొడవ చేయకుండా ఉండేందుకు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. నిర్బంధం విధించారు. సమస్యలు పరిష్కరించకుండా ఇలా పోలీసులను దించి భయపెట్టి ప్రాజక్టు పనులు చేపడుతుండడాన్ని నిర్వాసితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గత మూడేళ్లలో రైతులనుంచి వ్యతిరేకత ఎదురుకాని భూసేకరణే లేదని చెప్పవచ్చు. ప్రభుత్వం భూసేకరణ పేరుతో తమకు ఉన్న ఒకే అదరువును కొల్లగొడుతూ ఉందనే భావన రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టు, భోగాపురం విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఫుడ్ పార్క్ లు... ఇలా ప్రతిచోటా కనిపిస్తావుంది. దీనికొక పరిష్కారం కనుగొనేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు కనిపించదు.ప్రజావ్యతిరేకత ఎదురవుతున్నా లెక్కచేయకుండా పోలీసుల కాపలాతో ఈ ప్రాజక్టులను చేపట్టాలనుకుంటున్నది. ఇదే తులగాంలో కనిపిస్తున్నది.
