వచ్చే ఎన్నికల్లో టిడిపి, భాజపాతో పొత్తుపెట్టుకంటే నష్టపోవటం ఖాయమని సర్వే తేల్చేసింది.     

వచ్చే ఎన్నికల నాటికి మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య చీలిక తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, భాజపాతో కలిసి ఉంటే రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు, క్రిస్తియన్ తదితర వర్గాలు చంద్రబాబుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఒక మీడియా చంద్రబాబును బహిరంగగానే హెచ్చరిస్తోంది. తాజాగా జరిపిన ఓ శాంపిల్ సర్వేలో ఇదే విషయం స్పష్టమైందని చెప్పటం గమనార్హం.

దానికితోడు చంద్రబాబు, జగన్, పవన్ ను ఉద్దేశించి వెలువరించిన సర్వేలో నాలుగు ఉద్దేశ్యాలు స్పష్టంగా కనబడుతున్నది. ఒకటిః ఎలగైనా చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని. రెండుః జగన్ ప్రతిపక్ష నేతగా లాభం లేదని. మూడుః పవన్ రాజకీయాల్లో క్రియాశీలకమైనా పెద్ద ఉపయోగం ఉండదని. ఇక నాలుగోది, చివరిది, భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండకూడదని.

చంద్రబాబు చేయించుకున్న సొంత సర్వేల్లోనే ప్రభుత్వం, పార్టీ పట్ల ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నట్లు బాగా ప్రచారంలో ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దానికి తగ్గట్లే ఇదే అంశాన్ని చంద్రబాబు కూడా ప్రజాప్రతినిధులను అనేక సందర్భాల్లో హెచ్చరించటం అందరికీ తెలిసిందే. పైగా తాము వెల్లడించిన సర్వే వివరాలు కేవలం రాష్ట్రంలోని 23 నియోజకవర్గాలకు సంబంధించినది మాత్రమేనని చెప్పటం గమనార్హం. 23 నియోజకవర్గాల్లోని అభిప్రాయాలు రాష్ట్రం మొత్తానికి ఒక సూచికగా అభివర్ణిస్తోంది సదరు సంస్ధ.

ఇక, జగన్ విషయానికి వస్తే ప్రతిపక్ష నేతగా నూరు శాతం విజయం సాధించలేదన్న విషయం అందరూ అనుకుంటున్నదే. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటంలో జగన్ పెద్దగా సఫలం కాలేదన్న అభిప్రాయం పలువురిలో కనబడుతూనే ఉంది. అయినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూనే ఉన్న విషయం టిడిపి జరిపించుకున్న సర్వేల్లోనే వెల్లడవుతోంది.

ఇక, జనసేన గురించి సర్వే ఫలితాల్లో వెల్లడిస్తూ ఇప్పటికైతే పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నది. పైగా ఉభయగోదావరి జిల్లాల్లో బిసిలు, కాపులు కూడా చంద్రబాబు వైపే ఉన్నారంటూ సంస్ధ చెప్పటం పట్ల పలువురు అనుమానాలు వ్యక్త చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు గతంలోలా చంద్రబాబుకు దక్కదన్న విషయం స్పష్టమవుతోంది. కాబట్టి కాపుల ఓట్లు చీలిపోతే చంద్రబాబుకు ఇబ్బందే అని గ్రహించిన సదరు సంస్ధ ఆందోళన చెందుతున్నట్లే కనబడుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో టిడిపి, భాజపాతో పొత్తుపెట్టుకంటే నష్టపోవటం ఖాయమని సర్వే తేల్చేసింది.