ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. జనసేన, వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నాయి. వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ బంద్‌ సందర్భంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. బంద్‌ కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. నేడు జరగాల్సిన పాలిటెక్నిక్‌ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం జరిగే పరీక్షలను వాయిదా వేశారు. చాలాచోట్ల వ్యాపారస్తులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేశారు. తెల్లవారుజామునే అఖిలపక్ష నేతలు బస్‌డిపోల వద్ద బైటాయించడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

కృష్ణా జిల్లా లో...
మచిలీపట్నంలో మచిలీపట్టణం లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో  వామపక్షాలు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,కాంగ్రెస్ ,జనసేన ఇతర ప్రజా సంఘాలు బంద్ లో పాల్గోన్నాయి. తెల్లవారుజాము నుండి ఆర్టీసీ డిపో నుంచి  బస్సులు బయటకు రాకుండా నాయకులు అడ్డుకున్నారు. మరో వైపు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ.. కలెక్టరేట్ లో ఉద్రిక్తత నెలకొంది. 
మచిలీపట్నం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ విజయన్ ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. కాగా.. దానిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు  ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. ఇక విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వినూత్న ప్రదర్శన చేపట్టారు. విజయవాడ మొయిన్ రోడ్డు నుంచి రిక్షా తొక్కి నిరసన తెలిపారు.

చిత్తూరు..

చిత్తూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. తిరుపతి బస్టాండ్ సమీపంలో కొందరు ఆందోళనకారులు సోమవారం ఉదయం ద్విచక్రవాహనాలను తగలపెట్టారు.

విశాఖపట్నంలో...
 విశాఖపట్నంలో హోదా హోరు మారుమోగిపోయింది. వామపక్షాలు.. మద్దెల పాలెం డిపో వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. వీరి ఆందోళన కారణంగా చెన్నై హైవే పై భారీ ట్రాఫిక్ స్థంభించిపోయింది.

శ్రీకాకుళం జిల్లాలో...
ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌ శ్రీకాకుళం జిల్లాలో‌ ప్రశాంతగా కొనసాగుతోంది. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నిఆర్టీసీ డిపోలతో పాటు ప్రధాన కూడళ్లలో తెల్లవారుజాము నుంచే పోలీసులు మోహరించారు. పలాస, టెక్కలి, పాలకొండ డిపోల నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం బస్‌స్టేషన్‌ వద్ద వైకాపా నేత తమ్మినేని సీతారాం, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శలు కృష్ణమూర్తి, నరసింహులుతో పాటు మరికొందరు కార్యకర్తలు బస్సులను అడ్డుకొని నిరసన చేశారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించి డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. జిల్లా తపాలాశాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తాళాలు వేయించారు. అక్కడ నుంచి ఏడు రోడ్లుకూడలిలో నిరసన చేపట్టారు. పలాసలో బంద్‌ ప్రభావం పూర్తిగా ఉంది. టెక్కలి పాత జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

 అనంతపురం జిల్లాలో...
ప్రత్యేక హోదా సాధన కమిటీ పిలుపు మేరకు ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నేతలు బస్ డిపోల ఎదుట భైఠాయించి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 960 బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. బంద్ ప్రశాంతంగా నిర్వహించేలా ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. తెలుగు ప్రజలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మోసం చేస్తోందని ఆయా పార్టీల నేతలు విమర్శించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు అనంతపురం నగరంలో బస్టాండు నుంచి శ్రీకంఠం కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు.

 కడప జిల్లాలో...
 కడప జిల్లాలో హోదా పోరు జోరుగా సాగుతోంది.తెల్లవారు జామున 4 గంటల నుంచే వైకాపా, వామపక్ష, జనసేన పార్టీలు బంద్ చేపట్టాయి. ఆర్టీసీ బస్టాండ్‌ల నుంచి బస్సులను కదలకుండా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బంద్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో 850 బస్సులు నిలిచిపోయాయి. రాయచోటిలో వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎంతో పాటు జనసేన కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. నాలుగురోడ్ల కూడలిలో పార్టీ పతాకాలు చేతపట్టుకుని వాహన రాకపోకలను స్తంభింపజేశారు. 


నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వైసీపీ  నేతలు ఉదయం 6గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా తిరుగతూ.. పాఠశాలలు, దుకాణాలను బంద్ చేయించారు.

పలు చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తప్ప.. మిగితా  అన్ని చోట్లా బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా..బంద్ కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు.