అండర్ -19 జట్టులో సెలక్ట్ కాలేదనే బాధతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అమీర్ హన్సీఫ్ కుమారుడు జర్యాబ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..  మొదట అండర్ -19 జట్టుకి జర్యాబ్ సెలక్ట్ అయ్యాడు. అంతేకాదు గత జనవరి నెలలో కరాచీ తరఫున లాహోర్‌లో జరిగిన అండర్-19 టోర్నమెంట్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే చిన్న గాయం కారణంగా అతన్ని జట్టు నుంచి తప్పించి ఇంటికి పంపేశారు. గాయం తగ్గిన తర్వాత.. తిరిగి జట్టులో చేరే విషయమై కోచ్ ని అడగాడు. అయితే.. జర్యాబ్ వయసు ఎక్కువగా ఉందని.. అతనిని జట్టులోకి తీసుకోలేమని కోచ్ చెప్పాడు.

అంతేకాకుండా..జర్యాబ్ ని కించపరిచేలా కోచ్ మాట్లాడాడని అతని తండ్రి హన్సీఫ్ తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన జర్యాబ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అమీర్ హన్సీఫ్.. 1990లో పాకిస్థాన్ జట్టు తరపున ఆడాడు.