మోడి ఏదో భ్రమల్లో బ్రతుకుతున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు 

పెద్ద నోట్ట రద్దైన 45 రోజుల తర్వాత కూడా తమ సమస్యలు ఏమాత్రం తగ్గలేదని దేశమంతా గగ్గోలు పెడుతుంటే ప్రధాని మాత్రం ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ తన చర్యలను సమర్ధించుకోవటం ఆశ్చర్యంగా ఉంది.

మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగం విన్న తర్వాత అర్ధమయ్యిందేమంటే ప్రజలకు మరిన్ని కష్టలు తప్పేట్లు లేవు. మోడి ఏదో భ్రమల్లో బ్రతుకుతున్నట్లే కనబడుతోంది. నోట్ల రద్దు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై మోడి తన అభిప్రాయాలను చెబుతూ తీసుకుంటున్న చర్యలను సమర్ధించుకోవటం గమనార్హం.

మోడి ప్రసంగంలో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. మొదటిది బినామా చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయటం. రెండోది పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్ధితులను బట్టి నియమ, నిబంధనల్లో చేస్తున్న మార్పులను సమర్ధించుకోవటం. పైగా అవినీతి, నల్లధనాన్ని సమర్ధిస్తున్న వారే నిరంతరం ప్రభుత్వ విధానాలను తప్పపడుతున్నట్లు ప్రతిపక్షాలను విమర్శించటం.

డబ్బులు విత్ డ్రా, డిపాజిట్ తదితర విషయాల్లో ఆర్బిఐ రోజుకో నిబంధనను తెరపైకి తెస్తూ యావత్ దేశాన్ని గందరగోళంలో పడేస్తోంది. ఈ విషయంలో దేశప్రజానీకం మండిపడుతోంది. కొన్ని సార్లు కేంద్రం జోక్యం చేసుకుని నిబంధనలను ఉపసంహరించుకునేట్లు కూడా చేస్తోంది.

అయినా, ఆర్బిఐని ప్రధాని సమర్ధిస్తుండటం గమనార్హం. అంటే తన ఆర్బిఐ నిర్ణయాలతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవని అనుకోవాలి.

ఇక, రెండోదైన బినామీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పటం. ‘అవినీతిపై పోరాటంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మనం ఈ యుద్ధాన్ని గెలిచితీరాల్సిందే. దీన్ని ఆపటం, పలాయనం చిత్తగించటం వంటి అంశాలకు చోటేలేదు’ అని మోడి స్పష్టం చేసారు. అంటే, త్వరలో మరిన్ని కొత్త నిబంధనలు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.

పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చెప్పిన 50 రోజుల గడువు మరో 5 రోజుల్లో ముగుస్తున్నది. ఈ దశలో మోడి తన చర్యలను సమర్ధించుకోవటం చూస్తుంటే దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇప్పట్లో పరిష్కారం వచ్చేట్లు లేదు.

.