ఆత్మహత్యలకు దారితీస్తున్న స్మార్ట్ ఫోన్లు

Smartphone Addiction May Increase Suicide Risk In Teens
Highlights

  • స్మార్ట్ ఫోన్ కి బానిసలుగా మారుతున్న యువత
  • స్మార్ట్ ఫోన్ ల కారణంగా డిప్రెషన్ గురౌతున్న యువత

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గరా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఇంట్లో నలుగురు సభ్యులుంటే.. తలా ఒక స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు లభించడంతో.. ప్రతీ ఒక్కరూ వాటిని క్షణాల్లో కొనేస్తున్నారు. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ను విరివిగా వాడుతున్నారు. వీటికి వ్యసనంగా మారిపోయిన యువత.. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. చదువుకునే వయసులో పుస్తకాల పురుగులు కావాల్సిన పిల్లలు.. సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనంచేసుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలు.. బ్యాగులను ఓ మూలన పడేసి.. స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు. ఏ ఫ్రెండ్ ఏం పోస్టు చేశాడు? తను పెట్టిన ఫోటోకు ఎంతమంది లైక్ కొట్టారు? ఎంతమంది షేర్ చేశారు? ఏం కామెంట్స్ రాశారు? అనే ప్రశ్నావళికి సమాధానాలు వెతుకుతున్నారు. చివరకు తిండి తినడం కూడా మర్చిపోతున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్ లకు ఎడిక్ట్ అయ్యే వాళ్లు ఎక్కువ శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ నిపుణులు  ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కుటుంబసభ్యులతో కాకుండా.. నిత్యం మొబైల్ ఫోన్స్ తో కాలం గడిపేస్తూ.. ఒంటరిగా గడిపేవాళ్లలో డిప్రెషన్ పెరిగిపోతుంది. దాని ద్వారా ఆత్మహత్యలకు  పాల్పడుతున్నారు. కొందరు టీనేజర్లపై ఈ విషయంలో సర్వే చేయగా.. దాదాపు 48శాతం మంది టీనేజర్లు ఒక రోజులో 5, అంతకన్నా ఎక్కువ గంటలు స్మార్ట్ ఫోన్లతో గడుపుతున్నారు. గంటకన్నా తక్కువ సమయం ఈ స్మార్ట్ ఫోన్లతో కాలం గడిపేవాళ్లు కేవలం 28శాతం మంది మాత్రమే ఉన్నారట. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి వయసు 13 నుంచి 18 ఏళ్లలోపు ఉండటం గమనార్హం. ఉద్యోగం, వ్యాపారాలను చూసుకుంటూ.. తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల కూడా టీనేజర్లు స్మార్ట్ ఫోన్ లకు బానిసలౌతున్నారని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ అమ్మాయిలే ఎక్కువ శాతం ఆత్మహత్యలకు పాల్పడుతుండటం గమనార్హం.

loader