గౌరీ లంకేష్ హత్య కేసు.. నిందితుల ఊహాచిత్రాలు విడుదల

Sketches of Gauri Lankeshs murder suspects released
Highlights

  • గత నెల హత్యకు గురైన జర్నలిస్టు గౌరీలంకేష్
  • హత్య కేసును విచారిస్తున్న సిట్ అధికారులు
  • నిందితుల ఊహాచిత్రాలను విడుదల చేస్తున్న సిట్ అధికారులు

గత  నెల రోజుల క్రితం హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు హత్య కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది.  ఆమె కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసందే. అయితే..ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్న వారి ఊహాచిత్రాలను సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) శనివారం విడుదల చేసింది.

ఇద్దరు అనుమానితుల  మూడు ఊహాచిత్రాలను సిట్ అధికారులు మీడియా ముందు ఉంచారు. ప్రత్యక్ష సాక్షుల, సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఈ మూడు ఊహాచిత్రాలను గీసినట్లు అధికారులు చెప్పారు. ఇద్దరు అనుమానితుల్లో ఒకరివి రెండు స్కెచ్ లు గీసినట్లు సిట్ హెడ్, ఐజీపీ బీకే సింగ్ తెలిపారు.

కన్నడ వీక్లీలో పనిచేసే ప్రముఖ ఎడిటర్ గౌరీ లంకేష్(55)ను  నెల రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి తమకు రెండు వీడియో క్లిప్పింగ్స్ లభించాయని ఐజీపీ బీకే సింగ్ చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితుల వయసు దాదాపు 25నుంచి 30 మధ్యలో ఉండి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

హత్యకు ముందే.. ఆ ప్రాంతంలో నిందితులు రెక్కీ నిర్వహించి ఉంటారని.. ఆ తర్వాత హత్యకు పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయంలో దాదాపు 200 నుంచి 250మంది వరకు విచారించినట్లు బీకే సింగ్ తెలిపారు. ఈ కేసు విషయంలో ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గౌరీ లంకేష్ ని హత్య చేసిన వారిని పట్టించిన వారికి రూ.10లక్షల రివార్డు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

loader