శివసేన కార్యకర్త సునీల్ అరెస్టు 17కి చేరిన మృతుల సంఖ్య
ముంబయిలో మంగళవారం నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఈరోజు శివసేన కార్యకర్తని ఒకరిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శివసేనకు చెందిన సునీల్ షితప్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఘట్కోపర్ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్థుల భవనంలో ఓ నర్సింగ్ హోమ్ ని నిర్వహిస్తున్నారు. గత రెండు నెలలుగా దానిని మూసివేశారు. కాగా గ్రౌండ్ ఫ్లోర్ లోని నర్సింగ్ హోమ్ ని గెస్ట్ హౌజ్ గా మార్చాలనే ఉద్దేశంతో దానిని ఆధునీకరించే పనులు చేపట్టారు. వీటి కారణంగానే భవనం కూలిపోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు ఉదయం సునీల్ ని అదుపులోకి తీసుకున్నారు.
ఘట్కోపర్ ప్రాంతంలో నిన్న ఉదయం పది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17మంది మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలిని గత రాత్రి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
