బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కి కోర్టు నోటీసులు జారీ చేసింది. షారుక్‌ఖాన్‌ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ షేవింగ్‌ క్రీమ్‌ వాడటం వల్ల తనకు చర్మంపై దద్దుర్లు వచ్చాయని  ఓ వ్యక్తి కేసు పెట్టాడు. కేసువివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన రాజ్‌కుమార్‌ పాండే అనే వ్యక్తి స్థానిక మార్కెట్‌ నుంచి ఓ షేవింగ్‌ క్రీమ్‌ కొనుగోలు చేశాడు.

ఆ షేవింగ్‌ క్రీమ్‌కి షారుక్‌ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే రాజ్‌కుమార్‌ ఈ క్రీం వాడటంతో అతని ముఖంపై దద్దుర్లు వచ్చాయట. దాంతో షారుక్‌ఖాన్‌ తన ప్రకటనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక వినియోగదారుల న్యాయస్థానంలో కేసు పెట్టాడు. ఈ కేసు విషయమై సదరు న్యాయస్థానం షారుక్‌ఖాన్‌తో సహా షేవింగ్‌ క్రీం ఉత్పత్తి చేసే సంస్థ యాజమాన్యానికి, కొనుగోలు చేసిన దుకాణాదారుడికి, మధ్యప్రదేశ్‌ ఎఫ్‌డీడీ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌) డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.