పార్లమెంట్ సాక్షిగా శివసేన నేతల దురుసు ప్రవర్తన మరోసారి బయటపడింది. సాక్షాత్తు కేంద్ర మంత్రినే పార్లమెంట్ లోపల కొట్టడానికి ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నించారు. 

శివసేన అరాచకం మరోసారి పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. టీడీపీ నేత, కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజుతో శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. వీరికి వత్తాసుగా కేంద్రమంత్రి అనంత్‌గీతె కూడా రాజును కొట్టడానికి ప్రయత్నించడం గమనార్హం.

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విమానయాన సంస్థల నిషేధం పై పార్ల మెంట్ లో చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎంపీ రవీంద్రగైక్వాడ్‌ మాట్లాడిన తర్వాత కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతుండగా శివసేన ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదావేశారు.

సభవాయిదా పడిన వెంటనే శివసేన ఎంపీలు అశోక్ గజపతి రాజును చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రయత్నించారు. కేంద్ర మంత్రి అనంత్‌గీతె కూడా తన ఎంపీలతో కలసి అశోక్ గజపతి రాజును చుట్టుముట్టారు. ఈ సందర్భంగా గీతె మాట్లాడుతూ ‘ ముంబై నుంచి విమానాలు ఎలా వెళతాయో మేము చూస్తాం అంటూ పార్లమెంట్ లోనే బెదిరించారు.

అయితే అక్కడే ఉన్న మంత్రులు స్మృతి ఇరానీ, అహ్లూవాలియాలు గీతెను పక్కకు తీసుకెళ్లారు. మరోవైపు అశోక్‌గజపతిరాజును కాపాడేందుకు టీడీపీ ఎంపీలు కూడా ఆయన వద్దకు వచ్చారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ కలగజేసుకొని ఇరువైపుల వారిని వారించారు.