సెల్ఫీల మోజుతో ఇద్దరు ఆంధ్రా అమ్మాయిల మృతి

selfie mania kills two students in Andhra Pradesh
Highlights

  • సెల్ఫీ  కోసం ప్రయత్నించి ఇద్దరు  వైజాగ్ అమ్మాయిల మృతి
  • ఒడిషా రాష్ట్రంలో దుర్ఘటన
  • మృతులిద్దరు వైభవ్ జువెల్లరీ ఉద్యోగులు 

ఈ స్మార్ట్ పోన్లు, సోషల్ మీడియా కల్చర్ పెరిగినప్పటినుండి  యువతలో సెల్పీల మోజు విపరీతంగా పెరిగింది. ఎంతలా అంటే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర ప్రాంతాల్లో సేల్పీల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా సెల్పీల మోజులో పడి నేటి యువత ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనే ఒడిషా లోని రాయఘడ్ జిల్లాలో చోటుచేసుకుంది.  అత్యంత ప్రమాదకరంగా వున్న తీగల బ్రిడ్జిపై సెల్పీకి ప్రయత్నించి ఇద్దరు ఆంధ్రా యువతులు  మృత్యువాత పడ్డారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం విశాఖపట్నంకు చెందిన 9 మంది యువతీ, యువకుల బృందం విహారయాత్ర కోసం రాయఘడ జిల్లాలోని మజ్జిగౌరమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడి ఆలయంతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సరదాగా గడపడానికి నాగావళి నదీ పరిసర ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో నదిపై నిర్మించిన తీగల బ్రిడ్జి ఎక్కి వీరంతా ప్రమాదకర రీతిలో సెల్పీల కోసం ప్రయత్నించారు.  దీంతో జ్యోతి(27), ఎస్‌ దేవి(21)లు వంతెనపై నుండి నదిలోకి జారి పడిపోయారు. మిగతా  వారు ఈ ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నదిలో మునిగి ఈ ఇద్దరు యువతులు ప్రాణాలు విడిచారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరు యువతుల మృ​తదేహాలను బయటకు తీశారు.  మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. అలాగే వీరి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విహార యాత్రకని వెళ్లిన తమ పిల్లలు ఇలా మృత్యవాత పడటంతో ఆ కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. 

loader