హైదరాబాద్, నాగపూర్ ల రైలు ప్రయాణం సులభతరం కానుంది ఈ రెండు నగరాలకు ప్రత్యేకంగా రైల్వే కారిడార్ ని ఏర్పాటు చేయనుంది.
రెండు ప్రముఖ వాణిజ్య నగరాలు హైదరాబాద్, నాగపూర్ ల రైలు ప్రయాణం సులభతరం కానుంది. ప్రస్తుతం.. హైదరాబాద్ , నాగ్ పూర్ ల మధ్య రైలు ప్రయాణం దాదాపు 9గంటలపైనే పడుతుంది. అలా కాదని.. విమానంలో వెళ్దామని అనుకున్నా.. డైరెక్టుగా హైదరాబాద్ టూ నాగపూర్ కి విమాన సర్వీసు లేదు. దీంతో రెండు విమానాలు మారాల్సిన పరిస్థితి. అలా రెండు విమానాలు మారి గమ్యస్థానాన్ని చేరుకున్నా.. సమయం నాలుగు గంటలపైనే పడుతోంది.
దీంతో దీనికి రైల్వేశాఖ పరిష్కార మార్గం కనుగొంది. ఈ రెండు నగరాలకు ప్రత్యేకంగా రైల్వే కారిడార్ ని ఏర్పాటు చేయనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 584 కిలోమీటర్లు ఉంది. కాగా.. ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేసి .. ఆ లైన్ లో రైలు గంటకు 160 నుంచి 200కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. దీంతో దాదాపు 9గంటలు పట్టే ప్రయాణం.. మూడు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. త్వరలోనే ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
రష్యన్ రైల్వే సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నామని.. ఇందుకు రైల్వే బోర్డు ఆమోదం ప్రకటించాల్సి ఉందని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ రైల్వే లైన్ కనుక అమలులోకి వస్తే... ప్రజల ప్రయాణం సులభతరమౌతుంది.
