యడ్యూరప్పకు సుప్రీంలో ఎదురుదెబ్బ: బిజెపి విజ్ఞప్తికి నో

SC rejects BJP's plea for floor test
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కచ్చితంగా రేపు (శనివారం) శాసనసభలో బలనిరూపణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలపరీక్షకు గడువు కావాలని బిజెపి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

తమ పార్టీ ఎమ్మెల్యేలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని చెబుతూ వారి కోసం బలపరీక్షకు సోమవారం వరకైనా గడువు ఇవ్వాలని బిజెపి తరఫు న్యాయవాది రోహత్గీ కోరారు. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

అంతే కాకుండా ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో బలనిరూపణ జరగాలని ఆదేశించింది. సీక్రెట్ బ్యాలెట్ కు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప చెప్పారు. బలనిరూపణ జరిగేలోగా కీలక నిర్ణయాలేవీ తీసుకోకూడదని సుప్రీంకోర్టు యడ్యూరప్పను ఆదేశించింది. 

శాసనసభ్యులకు తగిన రక్షణ కల్పించాలని రాష్ట్ర డిజిపిని సుప్రీంకోర్టు ఆదేశించింది.  న్యాయమూర్తులు ఎకె సిక్రీ, ఎస్ఎ బోబ్డే, ఆశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిజెపి అడిగిన గడువుకు సుప్రీంకో ర్టు అంగీకరించలేదు. బలపరీక్షకు సమయం కావాలని బిజెపి అడిగింది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

మెజారిటీ నిరూపించకోగలమనే ధీమా తమకు ఉందని బిజెపికి చెందిన ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. సుప్రీంకోర్టు జారీ తాత్కాలిక ఆదేశాలు చారిత్రాత్మకమని, కాంగ్రెసు సీనియర్ నేత, జెడిఎస్ - కాంగ్రెసు తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.


అంతకు ముందు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.  ఎవరికి మెజారిటీ ఉందన్నది నిర్ణయించేది గవర్నరేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడినప్పటికీ యడ్యూరప్పకు రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది.

ఒకటి యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని పరీక్షించడం కాగా రెండోది 24 గంటల్లో బలనిరూపణ చేసుకోవడం. బలనిరూపణ శాసనసభలోనే జరగాలని కూడా సూచించింది. తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. 

బిజెపికి 104 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెసు - జెడిఎస్ కూటమికి 116 మంది సభ్యులున్నారు. బలపరీక్షలో నెగ్గడానికి 112 మంది సభ్యుల మద్దతు అవసరం.  కాంగ్రెసు, జెడిఎస్ కూటమికి చెందిన 14 మంది శాసనసభ్యులు బలపరీక్ష సమయంలో అసెంబ్లీకి గైర్హాజరైతే యడ్యూరప్ప నెగ్గుతారు. లేదా మరో ఎనిమిది సభ్యుల బలాన్ని కూడగట్టుకోవాల్సి ఉంటుంది.

మెజారిటీ ఉందంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపికి బలం ఉందా లేదా అనేదానికి సాక్ష్యం ఉందా, లేదా అనేది ముఖ్యమని కాంగ్రెసు, జెడిఎస్ తరఫున వాదించి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. అవకాశం ఇస్తే తాను మెజారిటీని నిరూపించుకుంటాననే దానిపైనే ఆధారపడ్డారని అన్నారు. 

ఓవైపు కాంగ్రెసు, జెడిఎస్ తమకు మెజారిటీ ఉందని లేఖ ఇచ్చి తర్వాత తనకు మెజారిటీ ఉందని యడ్యూరప్ప చెప్పారని, ఈ స్థితిలో దేనిపై ఆధారపిడ గవర్నర్ కూటమిని కాకుండా యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారని జస్టిస్ సిక్రి అన్నారు. 

loader