సౌదీ అరేబియా లో విదేశీ ఉద్యోగుల ఏరివేత ప్రారంభమవుతున్నది. దేశలోం నిరుద్యోగాన్ని తగ్గించేందుకు  సౌదీ పబ్లిక్ సెక్టర్ లో ఉన్న ఉద్యోగాలనుంచి విదేశీయులందరిని తొలగించి, సౌదీ దేశీయులతో నింపాలని  సివిల్ సర్వీసెస్ మినిస్ట్రీ ప్రభుత్వ శాఖ లన్నింటికి ఆదేశాలు జారీ చేసినట్లు మీడియా  పేర్కొంది.  ప్రభుత్వ శాఖ లన్నీ వచ్చే మూడేళ్ల గడువులో అన్ని ఉద్యోగాలను సౌదీ దేశీయులతో నింపేయాలని ఆదేశించారు. నేషనల్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోగ్రాం 2020 లో భాగంగా ఈ ఏరివేత చేపడుతున్నారు.

 

‘‘2020 తర్వాత సౌదీ ప్రభుత్వంలో విదేశీ ఉద్యోగులెవరూ ఉండకూడదు.’’ అని సివిల్ సర్వీసెస్ మినిస్ట్రీ కి చెందిన అబ్దుల్లా అల్-మెల్ఫి అధికారులను ఒక సమావేశంలో ఆదేశించారు.

‘‘ ప్రభుత్వో ద్యోగాలలో సంపూర్ణ జాతీయీకరణ అనేది ‘2020 నేషనల్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోగ్రాం’లోని అతి ముఖ్యమయిన విషయం.’ అని మెల్ఫీ పేర్కొన్నారని సౌదీ గెజెట్ పేర్కొంది. అంటే వచ్చే మూడేళ్లలో  ప్రభుత్వ శాఖల్లో ఉన్న 70 వేల మంది విదేశీ ఉద్యోగులను తొలగించి, ఆ స్థానాలలో సౌదీ దేశీయులను నియమిస్తారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే ఉంటారని అనుకుంటున్నారు.

ఆయిల్ ధరలు బాగా పడిపోవడంతో సౌదీ పబ్లిక్ సెక్టర్ వ్యయభారంతగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధించాలనుకుంటున్నది. అదే సమయంలో సౌదీ ప్రజలను సంతృప్తి పరిచేందుకుకు దేశీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనుకుంటున్నది. విదేశీ డెంటిస్టులను ఇక అనుమతించరాదని కూడా సౌదీ నిర్ణయించింది.

ఇప్పటికేప్రైవేట్ ఉద్యోగాలకు విదేశీయులను నియమించేందుకు ఉద్దేశించిన రెండేళ్ల వీసా కాలాన్ని ఒక ఏడాదికి తగ్గించారు. ఈ సంస్కరణలకు కారణం, సౌదీలో నిరుద్యోగం 2017 మొదటి క్వార్టర్ నాటికి 12.7 శాతానికి పెరిగడమే. దీనికి తోడు అయిల్ ధరలు పడిపోవడం కూడా గడ్డు పరిస్థితి తీసుకువచ్చింది. ఫలితంగా ‘విజన్ 2030’ ని ప్రభుత్వం ప్రకటించింది.  అయిల్ మీదే ఆధారపడిన ఆర్థికవ్యవస్థకు ముగింపు చెప్పి ఇతర వ్యాపార వాణిజ్య రంగాలలోకి విస్తరించాలనన్నది ఈ విజన్ లక్ష్యం. ఇపుడు సౌదీ రాజ్యంలో కోటి పదిలక్షల మంది విదేశీ వర్కర్లున్నారు. వాళ్ల మీద ఆధారపడటం పూర్తిగా మానేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జనవరి నుంచి ప్రైవేట్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను పనిలోకి తీసుకుంటే నెలకు 300 నుంచి 400 రియాల్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 2019లో విదేశీ ఉద్యోగులను పనిలోకి తీసుకుంటే 600 నుంచి 800 రియాల్స్ చెల్లించి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే స్థానికులకు ఉద్యోగాలు కల్పించి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇది తెలుగు వాళ్లందరికి దుర్వార్తే. ఎందుకంటే, ఈ రాష్ట్రాలలో ఉద్యోగాలు లేక పోవడంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు జిల్లాలను పేదయువకులు గల్ఫ్ వైపు ముఖ్యంగా సౌదీ వైపు చూస్తుంటారు.ఎన్నో కష్టాలు పడి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నాలుగు రూకలు మిగిలించుకుని ఇక్కడి కొస్తుంటారు. తర్వాత ఒక ఇల్లు కట్టుకుని, చిన్న వ్యాపారాలలో స్థిరపడుతుంటారు. ఇపుడు సౌదీ ద్వారాలు  మూసుకుపోవడం బాధాకరం. ఈ రెండు రాష్ట్రాలలో ఉద్యోగావకాశాలు పెరగక ముందే ఈ ఉపద్రవం ఎదురవుతూ ఉంది.