శశికళకు అన్నాడీఎంకే పగ్గాలు పార్టీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం జయ టీవీ లో ప్రత్యేక కథనం
తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అమ్మ మృతి తర్వాత పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి అయినా పాలన పగ్గాలన్నీ చిన్నమ్మ చేతిలోకే వచ్చాయి.
అన్నా డీఎంకే పార్టీ పగ్గాలను జయలలిత సన్నిహితురాలు శశికళకు అప్పగించాలని పార్టీ నేతలు నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని చిన్నమ్మను ఎమ్మేల్యేలందరూ కోరనట్లు పార్టీ అధికారక చానెల్ జయ టీవీలో కథనాలు ప్రసారమయ్యాయి.
అమ్మ చూపిన మార్గంలో పార్టీని నడపాలని పార్టీ నేతలందరూ శశికళను కోరారట. అయితే దీనిపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
27 ఏళ్లు గా అన్నా డీఎంకే పార్టీకి సర్వంతానై ముందుండి నడిపించారు జయలలిత. ఇప్పుడు అమ్మ స్థాయిలో చిన్నమ్మ పార్టీని నడిపించగలరా అనేది సందేహం.
పార్టీలో అప్పుడే పన్నీరు వర్గం ఒకటి తయారైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ వర్గం పన్నీరు వర్గంలో ఎవరు పై చేయి సాధిస్తారని తెలియాల్సి ఉంది.
మరో వైపు జయలలిత అనారోగ్యంతో మరణించిన రోజు రాత్రే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
అయినా కూడా ఆయన సీఎం హోదాలో ఇప్పిటకే రెండు సార్లు శశికళతో భేటీ అయ్యారు. అంటే అమ్మ స్థానంలో చిన్నమ్మ ఆదేశాలను ఇకపై పన్నీరు తప్పనిసరిగా పాటించే పరిస్థితి తలెత్తిన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలాగే కొనసాగుతుందా.. లేక పన్నీరు వర్గం ఎదరుతిరుగుతుందా అనేది ఇంకొన్నాళ్లు గడిస్తేనే కాని చెప్పలేం. పార్టీ ప్రధానకార్యదర్శిగా చిన్నమ్మ పదవి చేపడితే కచ్చితంగా ఆమె పార్టీలోనూ, పాలనలోనూ చక్రం తిప్పగలదని చెప్పొచ్చు.
కానీ, ఎన్నికల్లో అమ్మను చూసి ఓటేసిన జనం.. చిన్నమ్మను ఆ స్థాయిలో ఆదరిస్తారా అనేది అనుమానమే.
