ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్.. భారత మార్కెట్ లోకి రెండు స్మార్ట్ ఫోన్లను తీసుకువస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ పేరిట ఈ ఫోన్లను విడుదల చేయనుంది.  ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనకు ముందే ఈ ఫోన్లను శాంసంగ్  భారత మార్కెట్ లోకి తీసుకురానుంది. భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీన రాత్రి 10.30 గంటలకు ఈ ఫోన్ సిరీస్‌ను శాంసంగ్ లాంచ్ చేయనుంది. 

శాంసంగ్ లాంచ్ చేయనున్న గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లలో కెమెరాను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దారు. గతంలో వచ్చిన టాప్ మోడల్ స్మార్ట్‌ ఫోన్లకన్నా ఎన్నో రెట్ల మెరుగైన పనితీరు ఇచ్చే విధంగా వీటిల్లో కెమెరాలను ఏర్పాటు చేసినట్లు శాంసంగ్ చెబుతోంది. అలాగే ఈ ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్లు 5.8, 6.2 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లను కలిగి ఉన్నాయి. వీటిల్లో అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ లేదా శాంసంగ్ సొంతంగా తయారు చేసే ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 చిప్‌సెట్, ప్రాసెసర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫోన్లు 4 జీబీ ర్యామ్,  6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ,128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అవనున్నట్లు తెలిసింది.