ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ ఫోన్లపై టెలికాం సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ ఈ ఫోన్లపై ఆఫర్ ప్రకటించగా.. తాజాగా జియో కూడా ఈ జాబితాలో చేరింది. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9+ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తున్నాయి. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్‌కు చెందిన 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ మాత్రం ప్రత్యేకంగా శాంసంగ్ స్టోర్లు, శాంసంగ్ ఆన్‌లైన్ షాప్, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, జియో స్టోర్స్‌లో మాత్రమే లభిస్తున్నది.

ఈ క్రమంలో జియో ఈ వేరియెంట్‌పై 70 శాతం  బ్యాక్ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు అందులో జియో సిమ్ వేసి దాంట్లో 12 నెలలకు కలిపి రూ.2500 ఆపైన విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుని వాడాలి. దీంతో వారు ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్‌కు అర్హులు అవుతారు. ఇక 12 నెలల తరువాత ఫోన్‌ను అమ్మదలిస్తే దాని ఎంఆర్‌పీ ధరలో 70 శాతానికి ఫోన్‌ను వినియోగదారులు అమ్మవచ్చు. 

ఇక గెలాక్సీ ఎస్9 ప్లస్ 256 జీబీ వేరియెంట్‌పై రిలయన్స్ డిజిటల్ రూ.6వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అదేవిధంగా ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లను కొన్నవారు రూ.4,999 తో రీచార్జి చేసుకుంటే వారికి జియోలో రూ.15వేల విలువైన డేటా బెనిఫిట్ లభిస్తుంది. 1టీబీ (1024 జీబీ) ఉచిత మొబైల్ డేటా ఏడాది పాటు లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. దీంతోపాటు ఈ ఫోన్లను కొన్నవారికి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కాంప్లిమెంటరీ కింద అందిస్తున్నారు.