సమాజవాది పార్టీ గుర్తుపై వివాదం
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తండ్రికొడుకులు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ పై ఇప్పుడు వివాదం మొదలైంది. ఆ గుర్తు మాదంటేమాదేనని ములాయం వర్సెస్ అఖిలేష్ వర్గాలు ఢిల్లీకి చేరాయి.
అయితే వారికి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
కొద్ది రోజుల్లోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో సైకిల్ గుర్తును ఎవరికీ ఇవ్వడం సాధ్యంకాదని, ఆ గుర్తును ఈ ఎన్నికల్లో నిలిపివేయోచ్చని కేంద్ర మాజీ ఎన్నికల అధికారి ఖురేషి అభిప్రాయపడ్డారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
ఏదైనా పార్టీ చీలినప్పుడు గుర్తు కేటాయింపు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తుంటారు. అప్పుడు ఈసీ ఇరు వర్గాలకు చెందిన వారు అఫిడవిట్లు, ఆధారాలు పరిగణిస్తారు.
అప్పుడు ఏ వర్గం వారికి ఎక్కువ బలం ఉంటే వారికే గుర్తు కేటాయిస్తారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ ముగియటానికి దాదాపు ఐదు నెలల సమయం పడుతుందని అని ఖురేషి వివరించారు.
ఈ పరిస్థితి దృష్ట్యా సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయించే సమయం ఎన్నికల కమిషన్ కు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
