సోషల్ మీడియాలో కొనసాగుతున్న పుకార్లు : భద్రాద్రి జిల్లాలో మరో వ్యక్తిపై దాడి

First Published 24, May 2018, 11:43 AM IST
Rumor spread in social network at telangana

తెలంగాణ జిల్లాలో అనుమానం ఫెనుభూతమై కూర్చుంది. ఎవరిపైనైనా కాస్త అనుమానంగా కలిగితే చాలు స్థానికులు చితకబాదుతున్నారు. సోషల్ మీడియాలో బీహార్ దొంగలు, పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయన్న పుకార్ల కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయి. పుకార్ల వల్ల జరుగుతున్న దాడుల్లో అమాయకులు బలవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో ముగ్గురు మృతి చెందగా తాజాగా భద్రాద్రి జిల్లాలో మరో వ్యక్తిపై దాడి జరిగింది.

నిజామాబాద్, బీబి నగర్ లలో అమాయకులను పట్టుకుని స్థానికులు చితకబాదిన విషయాన్ని మరువక ముందే భద్రాద్రి జిల్లాలో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని సారపాక కూడలి వద్ద స్థానికులు పట్టుకుని దాడి చేశారు. సెల్ ఫోన్ లో బిగ్గరగా మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చి అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అయితే ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని విచారించారు. అతడు తనది పాల్వంచ అని బంధువుల వద్దకు వెళుతుండగా ఇలా తనపై దాడి చేశారని తెలిపాడు.  

ఇప్పటికే ఇలా సెషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో దాడులు చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ప్రజలకు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆయన హెచ్చరికలతోనైనా ఈ పుకార్లు, దాడులు ఆగుతాయని భావించినా ఆగకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 
 

loader