నారాయణ కళాశాలకు పెద్ద షాక్ తగిలింది.  కడపలోని నారాయణ కళాశాలకు రూ.10లక్షల జరిమానా విధించారు. ఈ విషయాన్ని ఆర్ఐవో( రీజనల్ ఇన్ స్పెక్షన్ ఆఫీసర్) రవి తెలిపారు. బుధవారం ఆయన కడపలోని పలు కళాశాలలో తనిఖీలు చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కడపలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపామన్నారు.

విద్యార్థి ఆత్మహత్య విషయంలో కళాశాల యాజమాన్యం, సిబ్బంది తప్పు ఉందని తమ విచారణలో తేలిందని చెప్పారు. దీంతో కళాశాలకు రూ.10లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని.. వాటిని తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆర్ఐవో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యల విషయంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి జాతీయ బాలల హక్కల కమిషన్ కి బుధవారం ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఈ పై రెండు విద్యాసంస్థల్లో 90మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే.