కధల్లో రాబిన్ హూడ్ పెద్దలను కొట్టి వారి సంపదను పేదలకు పంచిపెడతాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి చెబుతున్న మాటలు విచిత్రంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత తాను చెప్పిన 50 రోజులు గడువు ముగిసిన తర్వాత యూపీఏ పాలనపై విమర్శలు మొదలుపెట్టటం గమనార్హం. 50 రోజుల క్రితం తాను చెప్పినట్లుగా ఇప్పటికైతే ఏ అద్భుతం జరగలేదు.

దాంతో యూపిఏ పాలనపై విరుచుకుపడుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పాలన అవినీతిమయమైందనే కదా ఎన్డిఏని ఎన్నుకున్నది?

పైగా, యూపిఏ పాలనలో డబ్బు పోవటమే గానీ వచ్చింది లేదన్నారు. కానీ గడచిన రెండున్నర ఏళ్ళలో ఖజానాకు డబ్బులు వస్తున్న విషయానే అందరూ చూస్తున్నారని చెప్పారు. అప్పుడు పక్కదారి పట్టింది వాస్తవమే గానీ ఇపుడు ఖజానాకు డబ్బు వస్తున్న దాఖలేవీ లేవు. మోడి ప్రధాని అయిన రెండున్నరేళ్లల్లో కార్పొరేట్ సంస్ధలకు వేల కోట్ల పన్ను మినహాయింపులు వాస్తవం.

బ్యాంకుల వద్ద రానీ బాకీలు పెరిగిపోతున్నాయి. వేల కోట్ల బకాయిలున్న సంస్ధలన్నీ మోడికి అత్యంత సన్నిహితమే. ఇక మోడి చెబుతున్నట్లుగా పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని నల్లధనం మొత్తం ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేస్తోందని చెప్పటంలో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే, పెద్ద నోట్లను రద్దు చేసినపుడు దేశంలోని నల్లధనం సుమారు రూ. 4 లక్షల కోట్లుంటుందని అంచనా వేసారు.

నోట్లు రద్దైనపుడు దేశంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ. 15.5లక్షల కోట్లు. అందులో పెద్ద నోట్ల విలువ సుమారు రూ. 15 లక్షల కోట్లు. పై మొత్తంలో బ్యాంకులకు వెనక్కు వచ్చింది సుమారు రూ. 14.5 లక్షల కోట్లు.

ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా చేసిన ప్రకటనను బట్టే దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో బయటపడ్డ నల్లధనం రూ. 4313 కోట్లు. అంటే ప్రభుత్వం అంచనా వేసింది రూ. 4 లక్షల కోట్లైతే బయటపడింది కేవలం రూ. 4 వేల కోట్లే.

వాస్తవాలు ఈ విధంగా ఉంటే మోడి చెబుతున్న మాటలు చూస్తుంటే ప్రజల మనస్సుల్లో అభినవ రాబిన్ హూడ్ లాగ నిలిచిపోవాలని అనుకుంటున్నట్లు కనబడుతోంది. కధల్లో రాబిన్ హూడ్ పెద్దలను కొట్టి వారి సంపదను పేదలకు పంచిపెడతాడు.

నోట్ల రద్దు గడువు ముగిసిన సందర్భంగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మోడి మాట్లాడుతూ, ‘నల్లధనం రూపంలో వచ్చిందంతా పేదలకే పంచుతా’నంటూ చెప్పటం గమనార్హం. మోడి మాటలకు తగ్గట్లే వెంకయ్య లాంటి వాళ్లు త్వరలో తీపి కబురు వింటారని ప్రజలను ఊరిస్తుండటం గమనార్హం.