ప్యాసింజర్ రైలులో దోపిడీ జరిగింది. ప్రయాణీకురాలిని బెదిరించారు. అరిచావంటే నీ బిడ్డను రైల్లోనుంచి తోసేస్తామన్నారు. సిర్పూరు సింగరేణి ప్యాసింజర్ రైలులో బుధవారం సాయింత్రం గుర్తు తెలియని వ్యక్తి వేగంగా వెడుతున్న రైల్లోకి ఎక్కాడు. అందులో శశికళ అనే ప్రయాణీకురాలు తన అయిదేళ్ల కుమారుడు సాయికృష్ణతో కలిసి ఆసుపత్రిలో చూపించుకునే నిమిత్తంగా సిర్పూరు వెళుతోంది. ఆమె ప్రయాణిస్తున్న రైలు పెట్టెలో మరో మహిళ మాత్రమే ఉంది. ఆమె వేంపల్లి రైల్వే స్టేషన్‌లో దిగిపోయింది. దీంతో తల్లి, కొడుకు మాత్రమే ఉన్నారు. దుండగుడు ఆమె ప్రయాణిస్తున్న బోగీలోకి వచ్చి ఆమె గొంతు నొక్కి ఆమె వద్ద ఉన్న నగదు రూ.2600, మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కున్నాడు. అడ్డుకున్న శశికళను అరిచావంటే నీ కొడుకుని రైల్లోనుంచి తోసేస్తా అని బెదిరించడమే కాకుండా, ఆమెను కూడా సీటు కింద పడేసి గొంతు నొక్కినట్లు బాధితురాలు రోదిస్తూ చెబుతోంది. బలవంతంగా నగలు తీసుకుని రైలు కదులుతుండగానే దిగి పారిపోయాడని కాగజ్ నగర్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.