ఇండియన్ టెక్కీస్ కి ఇది నిజంగా శుభవార్త. హెచ్ 1 బీ వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. అమెరికాలోని ఇండియన్స్, ఇతర దేశీయులంతా తిరిగి తమ స్వదేశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై తాజాగా సంబంధిత అధికారులు స్పందించారు.

వీసా పొడిగింపు నిరాకరించి వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను యూఎస్‌సీఐఎస్‌ పరిగణలోకి తీసుకోదని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాతన్‌ వితింగ్టన్‌ వెల్లడించారు.

ప్రస్తుతమున్న నిబంధనల మేరకు ఏసీ 21లోని సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాదారులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఒకవేళ మార్పులు ఏదైనా జరిగినా హెచ్‌1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు మరో సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా కంపెనీలు అభ్యర్థించే అవకాశం ఉందని జొనాతన్‌ తెలిపారు.