టెలికాం రంగంలో జియో.. మరో రికార్డును సొంతం చేసుకుంది. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించింది. అక్టోబర్‌ నెలకుగానూ ట్రాయ్‌ వెలువరించిన లెక్కల ప్రకారం జియో 21.9 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్నినమోదు చేసింది. అంతేగాక అగ్రస్థానంలోనూ నిలిచింది. అంతకుముందు మే నెలలో 19.123 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఉండగా.. ఇప్పుడు ఆ వేగాన్ని అధిగమించింది.

ఇక మిగిలిన టెలికాం నెట్‌వర్క్‌ ల విషయానికొస్తే వొడాఫోన్‌ 8.7 ఎంబీపీఎస్‌ వేగంతో రెండో స్థానంలో నిలిచింది. 8.6 ఎంబీపీఎస్‌తో ఐడియా, 7.5 ఎంబీపీఎస్‌ సరాసరి వేగంతో ఎయిర్‌టెల్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక 4జీ అప్‌లోడ్‌ వేగంలో మాత్రం ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్‌ నెలకు గాను ఆ సంస్థ 6.4 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేసింది. 5.9 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్‌, 4.1 ఎంబీపీఎస్‌తో జియో, 3.5 ఎంబీపీఎస్‌తో ఎయిర్‌టెల్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐడియా, వొడాఫోన్‌ అప్‌లోడింగ్‌ స్పీడ్‌ క్రమంగా పెరగ్గా.. జియో వేగంలో ఎలాంటి మార్పూ లేదు. ఎయిర్‌టెల్‌ స్పీడ్‌ మాత్రం తగ్గుముఖం పట్టింది. మైస్పీడ్‌ యాప్‌ను ఉపయోగించి ట్రాయ్‌ ఈ గణాంకాలను సేకరిస్తుంది. ఆయా నెట్‌వర్క్‌ల డేటా వేగాన్ని ప్రతినెలా వెలువరిస్తుంటుంది.