హైదరాబాద్ నగర శివారు వనస్థలీపురంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. అనంతయ్య అనే  రియల్ ఎస్టేట్ వ్యాపారిని పట్టపగలే కిడ్నాప్ చేశారు. శనివారం ఉదయం అనంతయ్య బయటకు వెళ్లి వస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు అతనిని కిడ్నాప్ చేసి.. కారులో తీసుకొని వెళ్లిపోయారు.

బయటకు వెళ్లిన అనంతయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో  అతని కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. బంధువులు, స్నేహితులను కూడా ఆరాతీయగా... జాడ తెలియలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంమబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ దృశ్యాలు  సీసీ కెమేరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. అనంతయ్య గతంలో  నల్గొండ జిల్లాలో సర్పంచ్ గా పనిచేశారు.