బెంగళూరు: కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత సిద్ధరామయ్య కీలకమైన ప్రకటన చేశారు. కాంగ్రెసు నాయకత్వం ఆదేశిస్తే దళితు నేతను ముఖ్యమంత్రిని చేయడానికి తాను పక్కకు జరుగుతానని చెప్పారు. 

చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. చాముండేశ్వరి నుంచి మాత్రమే కాకుండా బాదామి నుంచి కూడా ఆయన శాసనసభకు పోటీ చేశారు. ఇవి తన చివరి ఎన్నికలని ఆయన చెప్పారు. 

దళిత నేతను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే మంచిదేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాారు. దేవెగౌడ నాయకత్వంలోని జెడి(ఎస్)తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

ఎగ్జిట్ పోల్స్ వచ్చే రెండు రోజుల పాటు వినోదం మాత్రమేనని ఆయన ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ గురించి ఆందోళన చెందవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు విజ్ఢప్తి చేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తున్నామని అన్నారు.